Header Banner

పులివెందుల పోలీస్ వ్యవహారంలో సంచలనం: సీఎంకే నోటీసుల వివాదం… సీఐ డిస్మిస్!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె. శంకరయ్యను సర్వీస్‌ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా వీఆర్‌లో ఉన్న సీఐ శంకరయ్యను పోలీస్‌ శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ ఆదేశాల ప్రకారం.. క్రమశిక్షణా చర్యలతో సీఐ జె.శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించడంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సీఐ శంకరయ్య ఇటీవల పరువు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇవ్వకపోవడంపై ఇప్పటికే సీఐ శంకరయ్య హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తనపై చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని, రూ.1.45కోట్ల పరువు నష్టం పరిహారం చెల్లించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం చంద్రబాబుకు శంకరయ్య నోటీసు పంపించారు. ఈ చర్యను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. డిస్మిస్ ఉత్తర్వుల్లో శంకరయ్య ప్రవర్తన, డిపార్ట్‌మెంట్‌ నిబంధనల ఉల్లంఘనలు, క్రమశిక్షణకు భంగం కలిగించే అంశాలనే ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం రాజకీయ వర్గాలు, పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.