Header Banner

ములుగు నేలలో పురాతన చరిత్ర: అరుదైన 23 తులాల నాణేలు వెలుగులోకి!

సాక్షి డిజిటల్ న్యూస్ :ములుగు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని తెలుసుకొని తవ్వకాలు జరపగా భారీఎత్తున బంగారు నాణేలు బయటపడ్డాయి. అయితే ఆ నిధిని పంచుకోవడంలో తేడాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి ఆ నిధి చివరికి ఏమైంది? ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కు మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలోని ఓ ఇంట్లో బంగారం నిధి ఉందని సమాచారం అందింది. వెంటనే ఆ ఆటో డ్రైవర్‌ అదే గ్రామానికి చెందిన ఒక కారు తీసుకుని మరో నలుగురితో కలిసి మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్ళారు. సిరివంచ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి చేరుకున్నారు. బంగారం ఉందని సమాచారం ఇచ్చిన ఆ ఇంట్లో ఐదు రోజులపాటు నిధి ఉన్న ప్రాంతంలో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. నిధి తవ్వకాలు అంతా వాళ్ళ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. తవ్వకాల్లో ఓ రాగిబిందె బయటపడింది. దీనిపై దుష్టశక్తి ఉందని దానిని తొలగించి తీసుకువస్తానని ఇంటి యజమానికి చెప్పి ఆ బిందెను మంగపేటకు తీసుకువచ్చారు. మూడు కోళ్లను బలిచ్చి పూజలు నిర్వహించారు. తవ్వకాలలో బయటపడ్డ బిందెను ఓపెన్‌ చేయగా అందులో బారీ ఎత్తున గోల్డ్ కాయిన్స్ లభ్యం అయినట్లు సమాచారం. ఒక్కో కాయిన్ సుమారు 23 తులాలు ఉంటుందని అక్కడికి వెళ్ళిన ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. మహారాష్ట్ర నుండి గుప్తనిధితో వారి గ్రామానికి చేరుకున్న తర్వాత.. బంగారు నాణేలున్న బిందెపై ప్రతికూల శక్తి ఉన్నందున దీనిని ప్రస్తుతానికి పాతిపెట్టి శాంతి పూజలు చేశాక పంచుకుందామని నిర్ణయించుకుని.. ఆ బిందెను ఒక బొప్పాయి చెట్టు మొదట్లో పాతి పెట్టినట్లు సమాచారం. మరుసటి రోజు పంపకాలకు సిద్ధమయ్యారు. పంపకాల విషయంలో తేడా జరిగింది..దీంతో విషయం కాస్తా బయటకు పొక్కింది. సమాచారం పోలీసులకు అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇంతకీ ఆ నిధి ఏమైంది..! అందులో దొరికిన బంగారం ఎంత..! ఎవరెవరు పంచుకున్నారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.