సాక్షి డిజిటల్ న్యూస్ :బిడ్డ తెల్లగా పుట్టడమే ఆ తల్లిపాలిట శాపమైంది. బిడ్డ తెల్లగా ఎలా పుట్టాడు.. ఎవరికి పుట్టాడంటూ నల్లగా ఉన్న భర్త నిత్యం ఆ తల్లికి నరకం చూపించాడు. అతడి ఫ్రెండ్స్ హేళనతో మొదలైన ఈ వేధింపులు చివరకు విషాదంగా ముగిశాయి. ఆ కిరాతకుడు పసిబిడ్డకు తల్లి లేకుండా చేశాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.కుటుంబ కలహాలు, అనుమానం చివరకు ఓ దారుణమైన హత్యకు దారి తీశాయి. తన చర్మం రంగు నల్లగా ఉండగా, పుట్టిన కొడుకు మాత్రం తెల్లగా ఉండటంపై స్నేహితులు, పొరుగువారు చేసిన ఎగతాళిని తట్టుకోలేకపోయిన ఓ భర్త, తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అనుమానంతో రగిలిపోయిన భర్త, ఏకంగా అత్తమామల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ షాకింగ్ సంఘటన బీహార్‌లోని కతిహార్ జిల్లాలోని అబాద్‌పూర్ థానే పరిధిలోని నారాయణ్‌పూర్ గ్రామంలో జరిగింది.అజమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్కి గ్రామానికి చెందిన సుకుమార్ దాస్, మౌసుమి దాస్ దంపతులకు మూడు నెలల క్రితం కొడుకు పుట్టాడు. సుకుమార్ నల్లగా ఉండగా.. ఆ బిడ్డ తెల్లగా పుట్టాడు. ఈ తేడా కారణంగా నువ్వు నల్లగా ఉన్నావు, నీకు తెల్ల కొడుకు ఎలా వచ్చాడు..? అంటూ సుకుమార్ స్నేహితులు, పొరుగువారు అతన్ని ఆటపట్టించడం మొదలుపెట్టారు.ఈ ఎగతాళి కారణంగా సుకుమార్ మనసులో తీవ్రమైన అనుమానాలు మొదలయ్యాయి. ఆ బిడ్డకు నిజమైన తండ్రి ఎవరో చెప్పాలంటూ భార్య మౌసుమితో నిత్యం గొడవ పడటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో దాదాపు మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతుండగా, మౌసుమి తండ్రి కూడా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. గొడవలు ఎక్కువ కావడంతో మౌసుమి తన పుట్టింటికి వెళ్లింది.అనుమానం, కోపంతో రగిలిపోయిన సుకుమార్.. అత్తగారింటికి వెళ్లాడు. రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయిన తర్వాత సుకుమార్ దారుణానికి పాల్పడ్డాడు. భార్య మౌసుమి దాస్ గొంతు కోసి హత్య చేయడమే కాక ఆమె ప్రైవేట్ భాగాలను చాలాసార్లు పొడిచి దారుణంగా హింసించాడు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు మేల్కొని, గదిలోకి వెళ్లి చూడగా, మౌసుమి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. అల్లుడు సుకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన తర్వాత గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న సుకుమార్ దాస్‌పై కేసు నమోదు చేసి, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.