Header Banner

భారత రాష్ట్రపతి పుట్టపర్తి సందర్శన—సత్యసాయి మహాసమాధి వద్ద నివాళులు!

సాక్షి డిజిటల్ న్యూస్ :రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సత్యసాయి జిల్లా పుట్టపర్తి  చేరుకున్నారు. శ్రీసత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సాయి కుల్వంత్‌ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి నిలయంలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.రాష్ట్రపతి ద్రౌపదీ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రాత్రి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బస చేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పుట్టపర్తికి బయలు దేరారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ముర్ముకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్వాగతం పలికారు.సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నిర్వహించిన శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కొనియాడారు. ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

చాలామందిలో పరివర్తన తెచ్చారు: సీఎం చంద్రబాబు సత్యసాయి బాబా తన సందేశాలతో చాలామందిలో పరివర్తన తెచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. నీటి సమస్య లేకుండా సత్యసాయి అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారని తెలిపారు.