సాక్షి డిజిటల్ న్యూస్ :ఐబొమ్మ రవి.. తెలుగు రాష్ట్రాల్లో అతడో సంచలనం. దొరికిపోయాడుగానీ.. లేకపోతే పైరసీ కేటుగాళ్లకు బిగ్‌బాస్ అయ్యేవాడు. ఇదంతా ఒక వైపే...! కస్టడీలో విచారణలో రవి మరో రూపం బయటపడింది. అన్ని కోణాల్లో విచారిస్తే... రవి క్రిమినల్ చర్యలు వెలుగులోకి వచ్చాయి. పైకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా కనిపించే రవి... లోపల క్రిమినల్ మెంటాల్టీ ఉన్న వ్యక్తి అని తేలింది. ఇంతకీ రవి చేసిన నేరాలు ఏంటి..? భార్యతో ఎందుకు విడాకులు తీసుకున్నాడు...?ఐబొమ్మ.. దీని పేరెత్తని నోరు లేదిప్పుడు. వన్ వీక్ నుంచి తెలుగు స్టేట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోందీ టాపిక్. ఐబొమ్మ రవి అరెస్ట్ అవడం, పైరసీ వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయడం.. ఒక వర్షన్ మాత్రమే. మరో వర్షన్‌పై పెద్ద డిస్కషనే జరుగుతోందిప్పుడు. ఇటు సినీ ప్రేక్షకులతోపాటు అటు సాధారణ ప్రజలు తనవైపు చూసేలా చేసిన ఈ ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా.? విలనా.? అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఇందులో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న వేళ విచారణలో రవి ఆగడాల గురించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పైకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లా కనిపించే రవి… లోన కరుడుగట్టిన హార్డ్‌వేర్ క్రిమినల్. టాలీవుడ్‌ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐబొమ్మ రవి.. పర్సనల్ లైఫ్‌లో కూడా సేమ్ టు సేమ్ రోల్‌ను పోషించాడు.ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తేల్చారు. పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించారు. అమీర్‌పేట్‌లో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడి గుర్తింపు కార్డులను తీసుకొని అనేక నేరాలు చేసినట్లు తెలిసింది. పెళ్లి అయిన తర్వాత కూడా రవి తన తీరు మార్చుకోలేదు. భార్య, తన కూతురిపై చేయి చేసుకునే వాడని పోలీసులు తెలిపారు. కూతురుపై చేయి చేసుకోవడం, క్రిమినల్ మెంటాలిటీ కారణంగానే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించారు పోలీసులు. తనను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.మరోవైపు నాలుగోరోజు విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్‌పై ఆరాతీశారు పోలీసులు. ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రతి 20 రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లొచ్చాడు రవి. అరెస్ట్‌కు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్‌కి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటిదాకా 40సార్లు ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్లానని.. ప్రతీచోటా లగ్జరీ హోటల్స్‌లో స్టే చేసినట్లు తేల్చారు. ఐబొమ్మ సైట్‌లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్‌కి 50 డాలర్లు వచ్చేవి. పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్‌కు రవి ప్రతి నెల రూ.50 వేలు ఇచ్చేవాడని పోలీసులు గుర్తించారు. మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఇమ్మడి రవి జీవితంలో ఉన్నాయి. అటు ఐబొమ్మతో రవి ఒక్కడే పైరసీ చేసినట్టు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి 5 ఏళ్లల్లో 100 కోట్ల రూపాయలు వరకు సంపాదించినట్టు తేల్చారు. 20 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.