సాక్షి డిజిటల్ న్యూస్ :హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న శ్రీ వైష్ణవి అనే విద్యార్థిని తమ అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన వైష్ణవి బిల్డింగ్ పై నుండి కిందకు దూకినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది.అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడిన వెంటనే స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న వైష్ణవిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు.. అయితే.. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు దృవీకరించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటన చోటుచేసుకున్న అపార్ట్మెంట్ వద్ద పోలీసులు క్లూస్ టీంతో కలిసి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. భవనం పైకప్పు నుంచి దిగువ అంతస్తులకు పడిన దూరాన్ని, ఆమె అక్కడికి ఎలా వెళ్లిందనే విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. విద్యార్థిని చదువుతున్న శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో కూడా విచారణ చేపట్టిన పోలీసులు పలువురు స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు.వైష్ణవి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనతో ప్రాంతం మొత్తంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. పెరుగుతున్న విద్యా ఒత్తిడిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల మనోస్థితిని అర్థం చేసుకుని, ప్రోత్సహించాలి.. కానీ ఒత్తిడి పెంచవద్దని తల్లితండ్రులకు పోలీసులు సూచిస్తున్నారు.. కాగా.. వైష్ణవి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.