సాక్షి డిజిటల్ న్యూస్ :మహిళా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మినిస్టర్ క్వార్టర్స్‌లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన 7 మండలాలకు స్వయం సహాయక సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ వడ్డీలేని రుణాలు పంపిణీ చేశారు. హుస్నాబాద్‌లోని 7 మండలాల్లోని 5,329 స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్ల 66 లక్షల 16 వేల వడ్డీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు.హుస్నాబాద్ మండలానికి సంబంధించి 445 మహిళా సంఘాలకు రూ. 46 లక్షలు, అక్కన్నపేట మండలానికి సంబంధించి 754 మహిళా సంఘాలకు రూ.85 లక్షలు, కోహెడ మండలానికి సంబంధించి 964 మహిళా సంఘాలకు రూ.కోటి 18 లక్షలు, చిగురు మామిడి మండలానికి సంబంధించి 821 మహిళా సంఘాలకు రూ.86 లక్షలు, సైదాపూర్ మండలానికి సంబంధించి 703 మహిళా సంఘాలకు రూ.86 లక్షలు, ఎల్కతుర్తి మండలానికి సంబంధించి 775 మహిళా సంఘాలకు రూ.74,42,00, భీమదేవరపల్లి మండలానికి సంబంధించి 867 మహిళా సంఘాలకు రూ.85 లక్షల 16 వేల చెక్కులు అందించారు.ప్రభుత్వం వడ్డీలేని రుణాలు మంజూరు చేయడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోనీ 7 మండలాలకు రూ.5 కోట్ల 66 లక్షల 16 వేల చెక్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో పరిశ్రమలకు లోన్ కావాలన్నా బ్యాంకర్లు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఆ లోన్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 18 ఏళ్లపై ఉన్నవారందరూ మహిళా సంఘాల్లో చేరాలని, ఆర్థికంగా ఎదగాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.