
సాక్షి డిజిటల్ న్యూస్ :తన ప్రాణ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయమై మరణించిన సంఘటన ఆ యువకుడిని కలచివేసింది. తలకు హెల్మెట్ పెట్టుకుంటే స్నేహితుడు బతికుండేవాడని ఎంతో బాధపడిన.. ఆ యువకుడు ఇతరులకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగవద్దని ఆలోచనతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. సొంత డబ్బులతో ఏడాది నుంచి హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి కళానగర్ కి చెందిన ఆడెపు సన్నీ అనే యువకుడు వాహనాలు నడిపే యువతకు హెల్మెట్ల పై అవగాహన కల్పిస్తున్నాడు.. అంతేకాకుండా ఉచితంగా హెల్మెట్లు అందిస్తూ ప్రాణం విలువ తెలుపుతూ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు.సన్నీ పట్టణంలోని జాతీయ రహదారిపై ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. తన ప్రాణ స్నేహితులు ఏడాదిన్నర క్రితం ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. ఆ సమయంలో సన్నీ ఆలోచించి హెల్మెట్ పెట్టుకుని ఉంటే స్నేహితుడు బతికుండే వాడని ఎంతో బాధపడ్డాడు. ఇలాంటి సమస్య మరొకరికి రావొద్దంటూ ఒక అడుగు ముందుకేసిన ఆ యువకుడు అప్పటి నుంచి నేటి వరకు ఊరూరా తిరుగుతూ హెల్మెట్ల రక్షణ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాడు. వస్త్రాలు కొనుగోలు చేసేందుకు తన దుకాణానికి వచ్చే యువతకు హెల్మెట్ల పై అవగాహన కల్పించి ఉచితంగా అందిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు..ఇప్పటివరకు సుమారు 500 పైనే హెల్మెట్లను యువతకు ఉచితంగా అందించాడు. వాహనాలు నడిపే మహిళలకు సైతం హెల్మెట్లను అందించి వాటి రక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపాలని, మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నాడు.కేవలం ఇంతవరకు ఆగకుండా లఘు చిత్రాలు, రీల్స్ చేస్తూ వాటిని వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర వాటిలో పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. ఈ యువకుడు చేస్తున్న ఉచిత సేవను పలువురు ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపి ప్రాణాలు రక్షించుకొని కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలనేదే.. తన లక్ష్యం అంటూ యువకుడు సన్నీ పేర్కొంటున్నారు..