సాక్షి డిజిటల్ న్యూస్ : ‘పుష్ప 2’ గ్లోబల్ బ్లాక్‌బస్టర్ విజయంతో అల్లు అర్జున్ మార్కెట్ పాన్ వరల్డ్ స్థాయికి చేరింది. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు బన్నీతో సినిమా చేయడానికి లైన్లో నిలిచినా మన హీరో మాత్రం కోలీవుడ్ సెన్సేషన్ అట్లీతో చేతులు కలిపాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ భారీ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సుమారు 1500 కోట్లకు పైగా బడ్జెట్‌తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో సినిమా స్కేల్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి 2027 సమ్మర్లో విడుదల చేయాలనే ప్లాన్ యూనిట్లో ఉందని టాక్. అయితే అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనే ప్రశ్న ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ, ప్రశాంత్ నీల్, సందీప్ వంగా, బోయపాటి శ్రీను వంటి స్టార్ డైరెక్టర్లు ఇప్పటికే బన్నీ కోసం వెయిటింగ్లో ఉన్నారు. తాజాగా సుకుమార్ కూడా ఈ రేసులోకి ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్ పూజ చేసిన తర్వాత రెగ్యూలర్ షూట్ మొదలుకానుంది. ఇదిలావుండగా సుకుమార్ టీమ్ పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్‌ను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ సినిమా, బన్నీ సినిమా కోసం రెండు వేర్వేరు టీమ్స్‌ను సుకుమార్ రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ ఇటీవల ఇచ్చిన స్టేట్మెంట్తో సుకుమార్, బన్నీ కాంబినేషన్‌పై స్పష్టత వచ్చింది. ‘RC17 పూర్తయ్యాక పుష్ప 3 షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని ఆయన చెప్పిన మాటలు ఇండస్ట్రీలో హల్చల్ సృష్టించాయి. దీంతో అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ పుష్ప 3కే ప్రాధాన్యత ఇవ్వనున్నారు అన్న సంకేతాలు బలపడ్డాయి. అయితే అట్లీ మూవీ విడుదలయ్యే సమయానికి, సుకుమార్–రామ్ చరణ్ చిత్రం పూర్తవడానికి ఇంకా ఏడాదిన్నర సమయం పడుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో పుష్ప 3 సెట్స్ పైకి వెళ్తుంది అని సమాచారం. ఏదైనా ఆలస్యం అయితే బన్నీ మరో ప్రాజెక్ట్‌ను మధ్యలో చేపట్టే అవకాశం కూడా ఉందని సినీ సర్కిల్స్ అంటున్నాయి.