Header Banner

పరకామణి ఘటనలో సీఐడీ దర్యాప్తు, భూమన కరుణాకర్ రెడ్డి నోటీసులు జారీ

సాక్షి డిజిటల్ న్యూస్ :తిరుమల పరకామణి చోరీ కేసులో.. వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లను చోరీ చేస్తూ పకరామణి ఉద్యోగి రవిపై పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అతనిపై 2023 ఏప్రిల్‌ 7న కేసు నమోదైంది. అప్పటి టీటీడీ ఏవీఎస్‌వోగా సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు  ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైసీపీ నేత భూమన విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.అయితే ఈ కేసును సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా విచారణ చేపట్టారు.  హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు..  పరకామణిలో కేసు దర్యాప్తును సీఐడీ బృందం చేపట్టింది. ఈ కేసుపై విచారణ జరిపి డిసెంబరు 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మరణించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో కొంత జాప్యం చోటుచేసుకుంది. నిన్న ( సోమవారం) తిరుపతి పద్మావతి అతిథిగృహంలో.. అప్పటి టీటీడీ వీజీవో గిరిధర్‌ను అధికారులు విచారించారు.ఈ విచారణలో పరకామణి అధికారులు మొదట మీకు సమాచారమిచ్చారా? అనే అంశంపై అధికారులు ఆరా తీశారు. అనంతరం చోరీపై టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, దానికి  సంబంధిత పత్రాలు, ఇతర వివరాలు ఎవరికి సమర్పించారని ఆడిగినట్లు తెలుస్తోంది. చోరీ సమయంలో తాము సేకరించిన విషయాలు అప్పటి సీవీఎస్‌వో నరసింహకిశోర్‌కు తెలియజేసినట్లు గిరిధర్‌ చెప్పినట్లు తెలిసింది. అలాగే చోరీ కేసు రాజీలో సతీష్‌కుమార్‌కు ఏమైనా సలహాలు ఇచ్చారా? ఆయనపై ఎవరిదైనా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారా? అని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే దానికి.. సరిగ్గా గుర్తించలేదని గిరిధర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటి ఏవీఎస్‌వో పద్మనాభంను కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ కేసు గురించి మీకు ఏం తెలుసని అధికారులు ఆరా తీశారు.