సాక్షి డిజిటల్ న్యూస్ :సురేఖా యాదవ్.. మన దేశంలోనే కాకుండా.. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా లోకో పైలట్‌గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం వందే భారత్, మెట్రో రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లను మహిళలు సక్సెస్‌ఫుల్‌గా నడిపేందుకు సురేఖా యాదవ్.. 37 ఏళ్ల క్రితమే అడుగులు వేశారు. అంతేకాకుండా.. భారత్‌లోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు అయిన ఐకానిక్ డెక్కన్ క్వీన్‌కు పైలట్‌గా పనిచేశారు. మహిళలు ఈ రంగంలో రాణించలేరు అనే అతిపెద్ద అపోహను ఆమె ఛేదించి.. టెక్నికల్ రంగాల్లో కూడా మహిళలు రాణించగలరను ఆమె ఒక మార్గదర్శిగా నిలిచారు.రైళ్లలో లోకో పైలట్ అంటే రైలును నడిపే డ్రైవర్. అయితే ఈ ఉద్యోగం అన్ని ఉద్యోగాల లాగా కాదు. రైలు ఇంజిన్‌లో నాన్‌స్టాప్‌గా విపరీతమైన శబ్దం, వేడి ఉంటాయి. పైగా ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగం. అయితే ఒకప్పుడు ఈ లోకో పైలట్‌గా పనిచేయాలంటే.. కేవలం పురుషులు మాత్రమే అర్హులు అని అంతా భావించేవారు. మహిళలు ఈ లోకో పైలట్ రంగంలోకి ప్రవేశించలేరు.. సక్సెస్ కాలేరు అనే అపోహలు ఉండేవి. అలాంటి సమయంలోనే ఒక మహిళ.. ధైర్యంగా ముందడుగు వేశారు. మహిళలు కూడా లోకో పైలట్ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరు అంటూ ప్రపంచానికి చాటి చెప్పారు. 1988లో భారత్‌లోనే కాకుండా మొత్తం ఆసియా ఖండంలో తొలి మహిళా లోకో పైలట్‌గా ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రస్తుతం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా వివిధ రైళ్లను నడుపుతున్న వేలాది మంది మహిళా లోకో పైలట్‌లకు ఆమె స్ఫూర్తి కేంద్రం. ఆమెనే సురేఖా యాదవ్ . 1988లో లోకోమోటివ్ డ్రైవర్ క్యాబిన్‌లో అడుగుపెట్టిన సురేఖా యాదవ్.. అప్పటివరకు ఏ మహిళకూ సాధ్యం కాని ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలికారు. రైల్వే క్యాబిన్‌లు మహిళలకు తగిన స్థలం కాదు అనే అపోహలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే.. ఆమె ఆసియాలోనే మొదటి మహిళా లోకో పైలట్‌గా నిలిచి.. ఇంజనీరింగ్, ప్రభుత్వ సేవల్లో మహిళల సామర్థ్యంపై ప్రపంచానికి ఉన్న దృక్పథాన్నే మార్చేశారు.మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన సురేఖా యాదవ్.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మెషీన్లతో పనిచేయాలనే కోరికతో ఆమె రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఎంపికై దశాబ్దాల భారతీయ రైల్వే చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించారు. నిత్యం శబ్దాలు చేసే రైలు ఇంజిన్లు, సుదీర్ఘ పనిగంటలు, కఠినమైన భూభాగంతో కూడిన ఆ రైల్వే ప్రపంచంలో మహిళలు ఒత్తిడిని తట్టుకోలేరనే విమర్శలు ఉండేవి. కానీ.. సురేఖా తన అచంచలమైన క్రమశిక్షణ, స్థిరమైన పనితీరుతో ఆ విమర్శలను పూర్తిగా తప్పని నిరూపించారు.సురేఖా యాదవ్.. లోకో పైలట్‌గా ఉద్యోగం ప్రారంభించిన కొత్తలో గూడ్స్ రైళ్లను నడపడంలో నైపుణ్యం సాధించారు. ఆ తర్వాత.. ఆమె భారతదేశ మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు అయిన ఐకానిక్ డెక్కన్ క్వీన్ (ముంబై, పూణే స్టేషన్ల మధ్య నడిచే రైలు) పైలట్‌గా అరుదైన మైలురాయిని చేరుకున్నారు. పూణే-ముంబై మధ్య ఉన్న ఘాట్‌లు దేశంలోనే అత్యంత కఠినమైన రైల్వే మార్గాల్లో ఒకటిగా చెబుతారు. నిటారుగా ఉండే వంపుల్లో రైలును అత్యంత కచ్చితత్వంతో నడపాల్సి ఉంటుంది. ఆమె విజయవంతంగా ఆ మార్గంలో రైలును పరుగులు పెట్టించి తన సత్తాను ప్రదర్శించారు. అయితే సురేఖా యాదవ్ ఎప్పుడూ తాను ఒక గొప్ప లోకో పైలట్ అని ప్రకటించుకోలేదు. ఆమె కేవలం తన పనిని మాత్రమే పూర్తి చేశారు. డే, నైట్ షిఫ్టులు అనే తేడా లేకుండా.. పొగమంచు, వర్షం ఉన్నప్పటికీ.. వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చారు. కానీ ఆమె నిర్వర్తించిన విధులు.. మహిళలు ఎక్కడైనా రాణించగలరనే సందేశాన్ని కేవలం మహారాష్ట్రకు మాత్రమే కాకుండా దేశంలోని యువతులకు పంపించింది.ఇక తన కెరీర్‌లో దశాబ్దాలుగా సురేఖా యాదవ్ అనేక మంది జూనియర్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నో గూడ్స్ రైళ్లు, లోకల్ రైళ్లు, మెట్రోలు, వందే భారత్ రైళ్లను నడుపుతున్న మహిళా లోకో పైలట్‌లకు సురేఖా యాదవ్ ఒక మార్గదర్శకురాలిగా, స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. మహిళలు స్టె్ కోర్సులు (STEM-సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగంలోకి రాణిస్తున్న ప్రస్తుత యుగంలో.. సురేఖా యాదవ్ కథ కేవలం ఒక అవకాశం మాత్రమే కాకుండా.. ఈ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది.