సాక్షి డిజిటల్ న్యూస్ :అఫ్గాన్-పాకిస్థాన్ ఘర్షణలు మరోసారి భగ్గుమన్నాయి. నిన్న అర్ధరాత్రి అఫ్గానిస్థాన్‌పై పాక్ గగనతల దాడులకు పాల్పడింది. డ్రోన్లను ప్రయోగించడంతో ఖోస్ట్ ప్రావిన్స్‌లోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. 10 మంది మృతిచెందగా, అందులో 9 మంది చిన్నారులే ఉన్నారని తాలిబన్ సర్కారు వెల్లడించింది. ఇతర ప్రావిన్స్‌ల్లోనూ దాడుల ప్రభావం కనిపించిందని పేర్కొంది. అఫ్గానిస్థాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ భారత్ పర్యటన సందర్భంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడింది. గతంలోనూ పాకిస్థాన్ ఇదే తరహా దుశ్చర్యలకు పాల్పడింది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో కాబుల్‌లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాక్ చీఫ్ నూర్‌వలీ మెహ్సూద్ స్థావరం లక్ష్యంగా పాకిస్థాన్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు అప్పట్లో షెహబాజ్ షరీఫ్ సర్కారు వర్గాలు సమర్థించుకున్నాయి.పాక్‌లో నిన్న ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. పెషావర్‌లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులు చేయగా, పారామిలిటరీ కార్యాలయం కాంపౌండ్ లోపల వరుస పేలుళ్లు సంభవించినట్లు పాకిస్థాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తాజా సంఘటన చోటుచేసుకుంది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాక్ (టీటీపీ) ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం కల్పిస్తోందని షరీఫ్ సర్కారు ఆరోపిస్తూ దాడులు చేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు జరిగాయి. పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతి స్పందిస్తున్నామన్నట్లుగా రెండు వర్గాలు వాదించుకున్నాయి. చివరకు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజా దాడితో మళ్లీ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.