సాక్షి డిజిటల్ న్యూస్ :రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వర ఆలయం విస్తరణ, అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.260 కోట్లు వ్యయంతో ఈ పనులకు ఖర్చు చేయనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును రెండు దశ్లోల పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసింది. నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఈ అభివృద్ధి పనులకు భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తుంది.ఈ విస్తరణ పనులతో ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు, సౌకర్యాలు అభివృద్ధి కానున్నాయి. దీంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు లభించనున్నారు. అలాగే ఆలయానికి మరింత ఆధ్యత్మిక శోభ రానుంది. ముఖ్యంగా ఆలయం చుట్టు ప్రక్కల ఉన్న ప్రాకారం భక్తులను ఆకర్షించేలా నిర్మించనున్నారు. ఏడంతస్తుల రాజగోపురం నిర్మాణంతో పాటు భక్తులు శ్రీవారి సేవలు చేసుకునేందుకు వీలుగా శ్రీవారి సేవ మండలం, ఆలయ రథాన్ని ఉంచేందుకు ప్రత్యేకమైన రథ మండపం వంటి నిర్మాణ పనులను చేయనున్నారు.వీటితో ఆలయం వైభవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యంగా అడుగులు వెస్తోంది.అంతేకాదు, ఈ అభివృద్ది పనుల్లో మరికొన్ని నిర్మాణాలను కూడా చేపట్టనున్నారు. ఆలయంలో ప్రముఖ ఆకర్షణగా ఉండేందుకు పంచముఖ ఆంజనేయస్వామి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భక్తుల పుణ్య స్నానాలకు పుష్కరిణి నిర్మాణం. అలాగే భక్తుల విశ్రాంతి తీసుకేందుకు విశ్రాంతి భవనం వంటి నిర్మించనున్నారు.