వైట్ హౌస్ దగ్గర గన్‌ఫైర్… గార్డ్స్ పరిస్థితి విషమం! ట్రంప్ స్పందన కీలకం

సాక్షి డిజిటల్ న్యూస్ :వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు సహా ముగ్గురు గాయపడ్డారు. ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకన్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వాషింగ్టన్‌లో కలకలం రేపగా, అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రత కోసం అదనపు నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలని ఆదేశించారు.అమెరికాలో కాల్పుల కలకం రేగింది. వైట్ హౌస్ భవనానికి కొద్ది దూరంలోనే కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు, మరొక వ్యక్తితో సహా మొత్తం ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగింది. వైట్ హౌస్ భద్రతా ప్రాంతానికి అతి సమీపంలో రద్దీగా ఉండే ఫారగుట్ స్క్వేర్ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఆఫీసులు, రెస్టారెంట్లు, కాఫీ షాపులు ఎక్కువగా ఉంటాయి.ఈ కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని ఆఫ్ఘన్ జాతీయుడు రహ్మానుల్లా లకన్వాల్‌గా అధికారులు గుర్తించారు. ఇతను 2021లో అమెరికాలోకి ప్రవేశించినట్లు తెలిసింది. మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ జెఫ్ కారోల్ తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ గార్డ్ సైనికులు రోడ్డుపై తిరుగుతుండగా, లకన్వాల్ అకస్మాత్తుగా వారిపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగాక, ఇతర గార్డ్ సభ్యులు అతన్ని చుట్టుముట్టి వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు.వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ఒకరిని లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని ఆమె అన్నారు. FBI డైరెక్టర్ కాష్ పటేల్ మాట్లాడుతూ.. గాయపడిన ఇద్దరు సైనికుల పరిస్థితి కొంత విషమంగా ఉందని తెలిపారు. ఈ దాడికి కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాడి జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని మూసివేశారు. వైట్ హౌస్‌ను వెంటనే లాక్‌డౌన్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. దాడి జరిగిన వెంటనే, భద్రత కోసం అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ దళాలను వాషింగ్టన్, డి.సి. నగరంలో మోహరించాలని అధ్యక్షుడు ఆదేశించినట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తెలిపారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *