Header Banner

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెల్త్ అప్‌డేట్—అధికారుల కీలక స్టేట్‌మెంట్

సాక్షి డిజిటల్ న్యూస్ :పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మృతి వార్తలను రావల్పిండి అడియాలా జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్‌ చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఆయనను ఇతర జైలుకు తరలించారనే వార్తలను సైతం జైలు అధికారులు ఖండించారు.  ఆయనను ఎక్కడికి తరలించలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ఈ పుకార్లను కొట్టిపారేశారు. అయితే, ఇమ్రాన్ సోదరీమణులు నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లు ఆయనను ఒకసారి చూపించాలని డిమాండ్ చేయగా.. ఇమ్రాన్‌‌ ఖాన్‌ను కలిసేందుకు డిసెంబర్‌ 2వ తేదీన కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. మరో వైపు ఆయన మరణించారనే వార్తలు సోషల్ మీడియలో రావడంపై అడియాలా జైలు వద్దకు మద్దతుదారులు  చేరుకున్నారు. అయితే ఆయన చనిపోలేదనే వివరణ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. అదే విధంగా ఇమ్రాన్‌ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు ఫైవ్‌స్టార్‌ హోటల్‌ స్థాయి కంటే మంచి ఆహారం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో 2023 ఆగస్టు నుంచి వివిధ కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత కొన్ని రోజులుగా  ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో హత్య చేశారని సోషల్ మీడియాతో పాటు పలు ప్రముఖ మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతోంది. బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్టులు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్‌ను మూడు వారాలకు పైగా కలవడానికి అనుమతించకపోవడంతో పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్  కార్యకర్తలు జైలు వద్ద నిరసనలు చేపట్టారు. కాగా, జైలు వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పంజాబ్ పోలీసులు దాడి చేశారని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్  కార్యకర్తలు ఆరోపించారు. అలాగే కొంతమంది జుట్టు పట్టుకుని ఈడ్చేశారని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.