సాక్షి డిజిటల్ న్యూస్ :ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపంలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రభావంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్లు, భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే సునామీ సంభావ్యత లేదని తెలిపింది. ఇదిలా ఉండగా, ఇటీవల వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ సమీపంలో ఇండోనేషియా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా, కొండ ప్రాంతాలు విరిగిపడడంతో విధ్వంసం నెలకొంది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని 11 నగరాలతో పాటు ఇతర జిల్లాల్లో ప్రభావితం అవ్వగా రెస్క్యూ బృందాలు చర్యలు చేపట్టాయి. ఇటీవల మాండైలింగ్ నాటల్‌లో ఉన్న ఓ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో కొండ జిల్లా, పొరుగున ఉన్న పడాంగ్ సిడెంపువాన్ నగరంలో వందలాది ఇళ్లు మునిగిపోయాయి.