Header Banner

చిన్నారి మీద అఘాయిత్యం, ప్రజల హృదయాల్లో ఆవేదన

సాక్షి డిజిటల్ న్యూస్ :మధ్యప్రదేశ్‌ రాయ్‌సేన్ జిల్లాలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు దుకాణాలపై, వాహనాలపై దాడులు చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన భద్రత కట్టుదిట్టం చేశారు.రాయ్‌సేన్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల సల్మాన్.. నవంబర్ 21వ తేదీన ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఐదు రోజులైనా నిందితుడు ఇంకా పరారీలోనే ఉండటం, అతన్ని పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. బాధిత బాలికకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు రహదారులపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా, అది ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. దుకాణాలు, వాహనాలపై దాడులు చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వి భయానక వాతావరణం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. హింసాత్మక చర్యలకు పాల్పడిన అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాయ్‌సేన్ జిల్లాలో బంద్‌ నిర్వహించారు. కొన్ని పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. ఐదురోజులుగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అత్యాచారం ఘటనపై సీరియస్‌ అయ్యింది. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని అధికారులు తెలిపారు.