Header Banner

మాజీ క్రికెటర్ బావమరిది ఆత్మహత్య ఘటనలో సంచలన సమాచారం

సాక్షి డిజిటల్ న్యూస్ :మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. సూసైడ్ తర్వాత నుంచి పుజారా బావమరిది జీత్ పబారి మొబైల్ ఫోన్ మిస్సైనట్టు పోలీసులు గుర్తించారు. అలాగే జీత్ పబారి ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఆయన మరణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బుధవారం రాజ్‌కోట్‌లోని తన నివాసంలో మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా బావమరిది జీత్ పబారి ఆత్మహత్య చేసుకోవడం నగరం అంతటా సంచలనం సృష్టించింది. రాజ్‌కోట్‌లోని అమీన్ మార్గ్‌లోని తన ఇంట్లో జీత్ పబారి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉదయం కుటుంబ సభ్యులు జీత్ గదిలోకి వెళ్లగా అక్కడ అతను వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే అతన్ని కలావద్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల దర్యాప్తులో తాజాగా కీలక విషయాలు వెలుగు చూశాయి. సూసైడ్ తర్వాత జిత్‌ పోన్ మిస్సైనట్టు పోలీసులు గుర్తించారు.కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాయి. ఆశ్చర్యకరంగా, జీత్ మొబైల్ ఫోన్ సంఘటన స్థలం నుండి కనిపించకుండా పోయింది, ఇది ఆత్మహత్య కేసులో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. దీంతో పాటు స్పాట్‌లో ఇప్పటివరకు ఎటువంటి సూసైడ్ నోట్ కూడా దొరకలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్పిన వివరాల ప్రకారం.. జిత్‌ కొన్నాళ్లు తీవ్ర నిరాషతో, డిప్రెషన్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ముఖ్యమైన కోణం ఏమిటంటే, సరిగ్గా అతను ఆత్మహత్య చేసుకున్న రోజుకు ఏడాది క్రితం అంటే 2024 నవంబర్ 26న, జీత్ పబారిపై అతని మాజీ కాబోయే భార్య మాల్వియానగర్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం ఫిర్యాదు చేసింది. వివాహం సాకుతో జీత్ అత్యాచారం చేశాడని ఫిర్యాదులో ఆరోపించబడింది. అయితే సరిగ్గా ఈ కేసు నమోదైన రోజే అతను మరణించడంపై అనుమానాలకు తావిస్తోంది.జీత్ మరణానికి అసలు కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జీత్ గదిలో విస్త్రుతంగా తనిఖీలు చేపట్టారు. సూసైడ్ తర్వాత అతని ఫోన్ ఎటు పోయిందని తెలుసుకునేందుకు ఇంట్లోని సీసీ కెమెరాలను సైతం తనిఖీ చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని, పోలీసులు ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు.