సాక్షి డిజిటల్ న్యూస్ :అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా పేరు మార్చి రాస్తున్నారంటూ కలెక్టర్‌కు అంబేద్కర్ వాదులు,దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఒక పెళ్లి శుభలేఖలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా కోనసీమ జిల్లా అని ముద్రించటంపై దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పేరు మార్చి రాయడంపై తప్పు పడుతున్నారు. కొందరు ప్రింటర్లు అంబేద్కర్ పేరు వాడటం ఇష్టంలేకనే.. కేవలం కోనసీమ జిల్లా అని ప్రింటింగ్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా మారింది. ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న దళిత జనాభా ఉండటంతో తమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని అప్పట్లో దళిత సంఘాలు నాటి వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అనే పేరుకు ప్రకటించింది. మొదట్లో అన్ని వర్గాలు దీనిని స్వాగతించినా.. నెమ్మదిగా అంబేద్కర్ పేరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి. పేరు మార్పుని వ్యతిరేకిస్తూ గతంలో అమలాపురం వేదికగా భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. కోనసీమ పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమలాపురం జిల్లాను కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని, అంబేద్కర్‌కు తాము వ్యతిరేకం కాకున్నా తమను తాము కోనసీమ వాసులుగానే పిలుచుకోవడానికి తరతరాలుగా అలవాటు పడిపోయామని కనుక ఆ పేరే కొనసాగించాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే జిల్లా పేరులో అంబేద్కర్ పేరును తొలగించినా, ఆ పేరు లేకుండా జిల్లా పేరు ముద్రించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ తాజాగా ఓ పెళ్లి పత్రికలో అంబేద్కర్ పేరు లేకుండా జిల్లా పేరు ముద్రించడం మళ్లీ వివాదానికి కారణమైంది.