సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు గురువారం ముట్టడించారు. ఈ మేరకు పోలీసుల యూనిఫాం ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు అయ్యప్ప మాల ధరించిన భక్తులతో పాటు బీజేవైఎం కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా, అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు సిబ్బంది యూనిఫాంతో పాటు మాల ధరించరాదన్న ఆంక్షలపై స్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో పోలీసులు ఒక్కసారిగా దూసురావడంతో స్వాములు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కొంతమందిని తాత్కాలికంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ.. పోలీసుల్లో అయ్యప్ప మాల ధారణను ఆపడం అన్యాయమన్నారు. మతాచారాలకు విఘాతం కలిగించే ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.