సాక్షి డిజిటల్ న్యూస్ :హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థాయ్ పొ జిల్లాలోని ఆకాశహర్మ్యాల్లో ఓ నివాస సముదాయంలో నిన్న( బుధవారం) భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందగా.. 250 మందికిపైగా గల్లంతయ్యారు. ఆ నివాస సముదాయంలో సుమారు 2 వేల మందికి పైగా నివాసముంటున్నారని, అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అక్కడున్న మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4,800 మంది జనాలు నివసిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు.హాంకాంగ్ కాలమానం ప్రకారం.. నిన్న ( బుధవారం) మధ్యాహ్నం 2.51 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక విభాగం చెబుతున్నారు. ఈ ప్రమాదాన్ని నం.5 అలారంగా అధికారులు వెల్లడించారు. ఈ అత్యధిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని రావాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించాయి. అలాగే అక్కడ భవనాలు దగ్గరదగ్గరగా ఉండడంతో.. మంటలు ఇతర భవనాలకు అతివేగంగా వ్యాపించాయి. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగినప్పటికీ రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. దీనికై మొత్తం 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టకగా.. ఘటనా స్థలంలో 57 అంబులెన్స్‌లు మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.