అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు మేజర్ గుడ్ న్యూస్

సాక్షి డిజిటల్ న్యూస్ :అమెరికాలో ఉన్నత విద్య, ఆపై మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడిపోవాలని కలలు కంటారు. అయితే, ఈ డ్రీమ్ సాకారం కావడం ఇప్పుడు అంత సులభం కాదు. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది అమెరికా. F-1 వీసా నిబంధనల్లో ‘ఇంటెంట్ టు లీవ్’ అనే కఠిన నిబంధనను రద్దు చేసే దిశగా ‘డిగ్నిటీ యాక్ట్-2025’ ప్రతిపాదించబడింది. దీనివల్ల చదువు తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలనే నిరూపణ అవసరం ఉండదు. ఈ మార్పులు విద్యార్థుల సంఖ్యను పెంచుతాయని అంచనా.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు.. ముఖ్యంగా మన భారతీయులకు అగ్రరాజ్యం ఓ భారీ ఊరట ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని కోసంF-1 స్టూడెంట్ వీసాల నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ‘ఇంటెంట్‌ టు లీవ్‌’ ( Intent to Leave ) అనే ఒక కఠినమైన నిబంధనను రద్దు చేసే దిశగా ‘డిగ్నిటీ యాక్ట్-2025’ అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించారు.‘ఇంటెంట్ టు లీవ్’ అంటే ఏంటి?: ఈ పాత రూల్ ప్రకారం, వీసా కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు… “మా చదువు పూర్తయిన వెంటనే, మేము తప్పనిసరిగా అమెరికాను విడిచిపెట్టి మా స్వదేశానికి తిరిగి వచ్చేస్తాం” అని కాన్సులర్ ఆఫీసర్‌కు నిరూపించుకోవాలి. దీన్ని నిరూపించడానికి, మన దేశంలో ఉన్న ఆస్తులకు సంబంధించిన పత్రాలు లేదా ఉద్యోగావకాశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉండేది.నిజానికి, స్టూడెంట్ ( F-1) వీసాలు చాలా వరకు ఈ ‘తిరిగి వెళ్లే ఉద్దేశం’ (ఇంటెంట్ టు లీవ్) నిరూపించుకోలేక తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ ఏడాది మన భారతీయ విద్యార్థులకు వీసాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఇదే. ఈ నిబంధన వల్ల, ఉన్నత చదువుల తర్వాత అక్కడే ఉద్యోగం వెతుక్కోవాలని లేదా స్థిరపడాలని చూసే విద్యార్థులకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలు, యూనివర్సిటీలలో భారీ ఉపకారవేతనంతో చదువుకోడానికి భారతీయ విద్యార్థులకు అవకాశం లభించినా.. వీసా మంజూరు కాని సందర్భాలు ఉన్నాయి. అలాగే, సోషల్ మీడియా వెట్టింగ్ వంటి కఠిన నిబంధనలు కూడా వీసాకు అడ్డంకిగా మారాయి. ఇలాంటి కారణాలతో అమెరికా వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.తాజాగా ప్రతిపాదించిన చట్టం కనుక అమల్లోకి వస్తే.. “తిరిగెళ్లే ఉద్దేశం ఉందా?” అనే ప్రశ్న కాన్సులేట్ అధికారి అడిగే అవకాశం లేదా దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అందుకేఎఫ్-1 వీసా నిబంధనలను సడలించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ మార్పులు అమలులోకి రావాలంటే.. ఈ ప్రతిపాదన అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభల్లో ఆమోదం పొంది, చివరిగా అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరోవైపు, విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం ఉండే వీలు లేకుండా.. ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరు చేయాలని కూడా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రతిపాదించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *