సాక్షి డిజిటల్ న్యూస్ : ఎయిర్‌బస్ తయారీ సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా.. భారత సహా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన ప్రకారం.. A320 సిరీస్ విమానాల్లో ఈ సమస్యను గుర్తించారు. సోలార్ రేడియేషన్ కారణంగా..ఈ లోపం తలెత్తినట్లు ఎయిర్‌బస్ వెల్లడించింది. దీని కారణంగా.. ఈ విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిందని ఎయిర్‌బస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌లో తక్షణ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 6 వేల ఎయిర్‌బస్ విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రెడేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు A320 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఎయిర్‌ఫ్రాన్స్ తమ సంస్థకు చెందిన 35 ఎయిర్‌బస్ విమాన సర్వీసులను ఇప్పటికే రద్దు చేసింది. అలాగే మరికొన్ని విమానాలపై ఈ ప్రభావం ఉండవచ్చని వెల్లడించింది. ఎయిర్‌బస్‌లో సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా.. విమాన సర్వీసుల్లో 70శాతం ప్రభావితమయ్యాయని కొలంబియన్ ఎయిర్‌లైన్ ఏవియాంకా వెల్లడించింది. ఇక, భారత్‌కు చెందిన విమానయాన సంస్థల వద్ద A320 సిరీస్ విమానాలు 560 వరకు ఉన్నాయి. అయితే తాజా సమస్య నేపథ్యంలో.. ఇందులోని 200-250 విమానాల్లో పలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడనుంది.