Header Banner

62 ఏళ్ల వయసులో పెళ్లి… తొలి ప్రధాని గా చరిత్ర సృష్టించిన నాయకుడు!

సాక్షి డిజిటల్ న్యూస్ :ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జోడీ హైడెన్‌ను పెళ్లి చేసుకున్నారు. పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న మొదటి ఆస్ట్రేలియా ప్రధానిగా రికార్డుకెక్కారు. శనివారం మధ్యాహ్నం కాన్‌బెర్రాలోని అల్బనీస్ అధికారిక నివాసంలో పెళ్లి వేడుక జరిగింది. అల్బనీస్ కొడుకు నాథన్, హైడెన్ తల్లిదండ్రులు బిల్, పౌలిన్‌తో సహా సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. 62 ఏళ్ల వయసులో అల్బనీస్ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ‘మా కుటుంబం, సన్నిహిత స్నేహితుల ముందు, మా భవిష్యత్‌ను కలిసి గడపడానికి మా ప్రేమ, నిబద్ధతను పంచుకోవడానికి మేము పూర్తిగా సంతోషిస్తున్నాం’ అని అల్బనీస్, హైడెన్ తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆంథోనీ, జోడీ హైడెన్ పెళ్లి ధ్రువీకరణ పత్రంపై సంతకాలు చేశారు. పెళ్లి వేడుకలో హైడెన్ సిడ్నీ డిజైనర్ రొమాన్స్ వాజ్ బోర్న్ రూపొందించిన దుస్తులను ధరించారు. ప్రధాని సూట్‌ను ఎంజే బేల్ రూపొందించారు. పెళ్లి ఉంగరాలను సిడ్నీలోని లీచార్డ్ట్‌లోని సెరోన్ జ్యువెలర్స్ రూపొందించింది.అల్బనీస్, హైడెన్ తొలిసారి ఐదేళ్ల కింద మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 2024లో వాలెంటైన్స్ డే రోజు కాన్‌బెర్రా రెస్టారెంట్‌లో అల్బనీస్ హైడెన్‌కు ప్రపోజ్ చేశారు. అనంతరం బహిరంగ కార్యక్రమాలు, అధికారిక విదేశీ పర్యటనలు, ఎన్నికల ప్రచారాల సమయంలో అల్బనీస్‌తో హైడెన్ కనిపించేవారు. 2019లో విడాకులు..అల్బనీస్ తన మాజీ భార్య, న్యూ సౌత్ వేల్స్ మాజీ డిప్యూటీ ప్రీమియర్ కార్మెల్ టెబ్బట్ నుంచి 2019 సంవత్సరంలో విడిపోయారు. వీరికి 20 ఏళ్ల కింద పెళ్లి జరిగింది. హైడెన్ ఎన్ఎస్డబ్ల్యూ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నారు. గతంలో సూపర్‌యాన్యుయేషన్ రంగంలో కీలక పాత్ర పోషించారు. ఆమె సిడ్నీలోని బ్యాంక్‌ స్టౌన్‌లో పుట్టారు.కాన్ బెర్రాలోని ప్రధాని ఆంథోని అధికారిక నివాసం ది లాడ్జ్ తోటలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. వివాహం విషయాన్ని ప్రధాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామితో కలిసి నడిచి వస్తున్న వీడియోలను సోషల్ మీడియోలో పోస్టు చేశారు. ఐదేళ్ల కింద మొదలైన వీరి ప్రయాణం తాజాగా పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు.