అల్లు అర్జున్ మేనేజర్ స్పందనపై విమర్శలు: పుష్ప 2 షాక్—శ్రీతేజ్ పరిస్థితి

సాక్షి డిజిటల్ న్యూస్ :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 గ‌త ఏడాది డిసెంబ‌ర్ 5న రిలీజైన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మించింది. అయితే సినిమా రిలీజ్‌ ముందు రోజు అంటే డిసెంబ‌ర్ 4 2024న పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ వ‌స్తున్నాడ‌నే విష‌యం తెలుసుకున్న శ్రీతేజ్ అనే పిల్లాడు అభిమాన హీరోని చూడ‌టానికి త‌ల్లితో క‌లిసి వ‌చ్చాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్‌లో ఆ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో శ్రీతేజ్ త‌ల్లి చ‌నిపోయింది. శ్రీతేజ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగి ఏడాది పూర్త‌వుతోంది. ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఓ రోజు జైలులోనూ ఉన్నాడు కూడా. పిల్లాడి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వైద్య సదుపాయాల‌ను అందించ‌టంతో పాటు పిల్లాడికి ఆరోగ్యం బాగుప‌డే వ‌ర‌కు అంతా తానే చూసుకుంటాన‌ని హీరో త‌న టీమ్‌తో చెప్పించాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, శ్రీతేజ్ బెడ్‌పైనే ఉన్నాడ‌ని  తండ్రి బాధ‌ప‌డుతున్నాడు. ఆరు నెల‌ల కింద హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్‌ను తండ్రే అన్నీ తానై చూసుకుంటున్నాడు. చిన్నారి మెద‌డులో న‌రాలు డెబ్బై శాతం దెబ్బ‌తిన‌టంతో క‌నీసం ఆక‌లంటూ సైగ చేయ‌లేని స్థితిలో శ్రీతేజ్ ఉన్నాడు.పిల్లాడికి నెల‌కు ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతున్నాయ‌ని, అల్లు అర్జున్ మేనేజ‌ర్‌ను సంప్ర‌దిస్తుంటే అత‌ను స్పందించ‌టం లేద‌ని శ్రీతేజ తండ్రి భాస్క‌ర్ బాధ‌ప‌డుతున్నారు. ఏడాది దాటినా పిల్లాడి ఆరోగ్య ప‌రిస్థితి మెరుగు కాక‌పోవ‌టం, పిల్లాడు మామూలు స్థితికి వ‌చ్చే వ‌ర‌కు అంతా తానై చూసుకుంటాన‌న్న హీరో ప‌ట్టించుకోక‌పోవ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి దీనిపై అల్లు అర్జున్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *