పౌర అణు రంగంలో భవిష్యత్ ఒప్పందాలపై చర్చ — రష్యా అధ్యక్షుడి భారత్ సందర్శన

సాక్షి డిజిటల్ న్యూస్ :రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ నేడు భారత్‌లో పర్యటించనున్నారు. పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల సహకారాన్ని భారత్, రష్యా మరింత బలపరుచుకోనున్నాయి. ఇందులో భాగంగా.. కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రష్యా పార్లమెంటు దిగువ సభ ‘డ్యూమా’ భారత్‌తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి తాజాగా ఆమోదించింది. దీంతో రష్యా అధ్యక్షుడి పర్యటన ప్రస్తుతం పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా.. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడి గౌరవార్థం ఢిల్లీలో నేడు ప్రధాని మోదీ ప్రైవేటు విందు ఏర్పాటు చేస్తారు. అలాగే రేపు (శుక్రవారం) ఇరువురు నేతలు ఢీల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్యైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాదు రష్యా ప్రభుత్వరంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానెల్‌ను పుతిన్ ప్రారంభించనున్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌ను పుతిన్ సందర్శించనున్నారు. భారత్‌లో పుతిన్ పర్యటన మొత్తం 28 గంటల పాటు కొనసాగుతుందని సమాచారం.నేడు ఢిల్లీలో భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, ఆండ్రె బెలౌసోవ్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భారత్ మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్-30 యుద్ధ విమానాల ఉన్నతీకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *