విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల బహిరంగ నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్ :బడికి సక్రమంగా హాజరు కాని ఓ విద్యార్థిని తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా ఆ విద్యార్థి ఇంటి ముందే ధర్నా నిర్వహించారు. ఈ ఆసక్తికర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో శనివారం జరిగింది. నిమ్మలగూడెం గిరిజన పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నక్క మనోవరుణ్‌ అనే బాలుడు 4వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అతడు బడికి సరిగా రావడం లేదు. వచ్చినా ఉపాధ్యాయుల కళ్లుగప్పి తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయురాలు రుక్మిణి పలుమార్లు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, కౌన్సెలింగ్ నిర్వహించినా వారిలో మార్పు రాలేదు. దీంతో ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో కలిసి శనివారం మనోవరుణ్‌ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేసారు. ప్రతి చిన్నారి విద్యా హక్కును కాపాడటం, ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేలా చూడటం తమ బాధ్యత అని, ఆ విషయం తెలియజేయడానికే ఇలా చేశామని హెచ్‌ఎం రవి తెలిపారు.ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నిరసనతో బాలుడి తల్లిదండ్రులు స్పందించారు. సోమవారం నుంచి తమ కుమారుడిని తప్పనిసరిగా బడికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *