Header Banner

“పెళ్లి వేదికపై సంచలనం: అబ్బాయికి లక్షల కట్నం, ఖరీదైన కారు కావాలంటూ కట్టుబడి డిమాండ్!”

సాక్షి డిజిటల్ న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సదర్ బజార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుక జరుగుతుంది. వరుడు వ్యాపారవేత్త అయిన రిషబ్. పెళ్లి బారత్‌తో యుగ్వీనా లైబ్రరీ సమీపంలోని పెళ్లి మండపానికి వచ్చాడు. అయితే మరికొన్ని నిమిషాల్లో తాళి కట్టనుండగా.. ఇంతలో మండపంలో కలకలం రేగింది. వరుడు రిషబ్‌ తనకు ఉన్నపలంగా బ్రెజ్జా కారు, రూ. 20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పెళ్లిని రద్దు చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. వరుడు రిషబ్‌ను ఒప్పించేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని వధువు తండ్రి మురళీ మనోహర్ తెలిపారు.ఇంతలో ఈ యవ్వారం కాస్తా వధువు చెవిన పడటంతో.. ఈ దురాశపరుడిని నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు అని అందరి ముందు ప్రకటించింది. తన కుటుంబ నిస్సహాయతను చూసి, వధువు ఇంద్రపాల్ పెళ్లి రద్దు చేసింది. నా కుటుంబాన్ని గౌరవించని అబ్బాయితో కలిసి జీవించలేను అని ఆమె చెప్తున్న వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. నా తండ్రిని, సోదరుడిని కట్నం కోసం అతిథులందరి ముందు అవమానించాడు. భవిష్యత్తులో నన్ను ఎలా గౌరవిస్తాడు? అలాంటి దురాశపరుడిని వివాహ చేసుకోలేను.. అని వీడియోలో వధువు ఇంద్రపాల్ చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లింట వాగ్వాదం జరిగింది. కంటోన్మెంట్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు రిషబ్, అతని తండ్రి రామ్ అవతార్, అతని బావమరిదిని అదుపులోకి తీసుకున్నారు. వధువు వైపు నుండి అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ పోలీసు అధికారి తెలిపారు. సిక్లాపూర్‌కు చందిన ఇంద్రపాల్ అనే యువతితో 8 నెలల క్రితం రిషబ్‌కు వివాహం నిశ్చయమైందని వధువు తండ్రి మురళీ మనోహర్ తెలిపారు. వివాహం నిశ్చయించే సమయంలో, వరుడి తండ్రి మా కుమార్తెకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చి పంపమని, కట్నం వద్దని చెప్పారు. మే నెలలో ఓహోటల్‌లో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు రూ.3 లక్షలు ఖర్చు పెట్టాం. నిశ్చితార్ధంలో వరుడికి బంగారు ఉంగరం, గొలుసు, రూ.5 లక్షల నగదు కూడా ఇచ్చాం. ఆ తర్వాత వారి డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి. మా కూతురు సంతోషంగా ఉంటుందని భావించి మేము వాటిని నెరవేరుస్తూ వచ్చాం. పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లి ఆహ్వాన పత్రికతో వరుడి ఇంటికి వెళ్లగా.. ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గృహోపకరణాలు, నగలు, రూ. 1.2 లక్షల నగదుతో సహా అనేక వస్తువులను కట్నంగా వధువుతోపాటు పంపించాలని అన్నారు. పెళ్లి మండపం ఖరీదైనా హోటల్‌లో ఏర్పాటు చేయాలని కోరడంతో అందుకూ అంగీకరించాం.. చివరకు తాళి కట్టే సమయంలో రూ.20 లక్షల నగదు, ఖరాదైనా కారు కట్నంగా ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.. అని వధువు తండ్రి మురళీ మనోహర్ మీడియాకు తెలిపారు.