సాక్షి డిజిటల్ న్యూస్ :అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన చివరి దశకు చేరింది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో పర్యటించిన మెస్సీ నేడు (సోమవారం) ఢిల్లీకి చేరుకోనున్నాడు. అయితే.. ప్రతికూల వాతావరణం కారణంగా ఉదయం 10.45 గంటలకు ఢిల్లీలో ల్యాండ్స్ కావాల్సిన మెస్సీ విమానం ఆలస్యం కానుందని సమాచారం. ఇక అతడి రాక సందర్భంగా దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.చాణక్యపురిలోని ది లీలా ప్యాలెస్ హోటల్‌లో మెస్సీతో పాటు అతని బృందం బసచేయనుంది. ఈ క్రమంలో ఈ హోటల్‌లోని ఓ అంతస్తును మొత్తం రిజ్వర్ చేశారు. ఈ హోటల్‌లోని ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో మెస్సీ దిగనున్నారు. ఇక్కడ ఓ రాత్రికి రూ. 3.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అంటున్నారు. మెస్సీ బస గురించి ఎటువంటి వివరాలను పంచుకోవద్దని హోటల్ సిబ్బందికి కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.హోటల్‌లో ప్రత్యేకంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు కార్పొరేట్ సంస్థల అధిపతులు, వీఐపీలు మెస్సీని కలిసేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మెస్సీని కలిసి హ్యాండ్‌షేక్ చేసే అవకాశం కోసం కొందరు వీఐపీలు ఏకంగా రూ.కోటీ వరకు ఖర్చు చేసినట్లుగా సమాచారం. ఆ తరువాత మెస్సీ పలువురు అత్యున్నత ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులను కలుస్తారు. సాయంత్రం 6.15 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 8 గంటలకు భారత్ దేశం నుంచి బయలుదేరనున్నారు.