Header Banner

కొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ జంతువు సంచారం

సాక్షి డిజిటల్ న్యూస్ :అడవి దున్నలకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని అడవులు కేరాఫ్ గా మారాయి. ఈ అడవుల్లో అక్కడక్కడా ప్రత్యక్షం అవుతున్న అడవిదున్నలు ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. భారీకాయంతో రహదారిపై ప్రత్యక్షమైన అడవిదున్నను చూసి బాటసారులు ఆందోళనకు గురయ్యారు. అది రోడ్ క్రాస్ చేస్తుండగా వీడియో తీశారు. ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేయడంతో.. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ముస్మీ-కర్ణగండి రహదారిపై అతిపెద్ద అడవి దున్న సంచరిస్తోంది. అటవీమార్గంలో వెళ్లే వాహనదారులు అడవిదున్నను చూసి భయాందోళనకు గురయ్యారు. అడవి దున్న రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలను కాస్త దూరంలో నిలిపేశారు. అది తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడ్డారు. కారులో నుంచే అడవి దున్న కదలికలను సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. నెల రోజుల వ్యవధిలో మూడోసారి ఈ ప్రాంతంలో అడవి దున్నల సంచారం కలకలం రేపింది. ఈ అడవుల్లో ఇవి పెద్ద సంఖ్యలోనే ఉండి ఉంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీ మార్గంలో ప్రయాణించేవారు అలెర్ట్ గా ఉండాలని సూచించారు.