Header Banner

కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ డిమాండ్ ముదురుతోంది

సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ పోరు తీవ్ర రూపం దాలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పగించాలనే డిమాండ్ రోజురోజుకీ బలపడుతోంది. ఇప్పటికే పార్టీ లోపల రాహుల్ – ప్రియాంక వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రియాంక గాంధీ చేసిన ప్రసంగం పార్టీ నేతలు, కార్యకర్తలను ఆకట్టుకోవడంతో ఆమెకు మద్దతు పెరుగుతోంది. మరోవైపు రాజకీయంగా కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం, సీనియర్ నేతలకు కూడా అందుబాటులో లేకపోవడం, ఆయన ప్రచారం చేసిన చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడం వంటి అంశాలు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని మరింత పెంచుతున్నాయి.
సీనియర్ జర్నలిస్టు స్వాతి చతుర్వేది ఎన్‌డీటీవీ వెబ్‌సైట్‌లో రాసిన కథనంలో, రాహుల్ గాంధీ పార్టీకి తగిన సమయం కేటాయించకపోవడంపై సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉందని, అందుకే ప్రియాంక గాంధీని ముందుకు తేవాలని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు.ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీకి అవకాశం ఇస్తే ఆమె ఇందిరా గాంధీ లాంటి శక్తివంతమైన నాయకురాలిగా దేశాన్ని నడిపించగలరని అన్నారు.ఈ వ్యాఖ్యలకు మరింత దుమారం రేపుతూ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా రంగంలోకి దిగారు. ప్రియాంక గాంధీ “పెద్ద పదవి”కి అన్ని విధాలా అర్హురాలు అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మొత్తానికి కాంగ్రెస్‌లో నాయకత్వంపై అంతర్గత కలహాలు బహిర్గతమవుతుండగా, రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తును ఏ దిశగా తీసుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.