విష్ణు విగ్రహ కూల్చివేత నేపధ్యంలో థాయిలాండ్–కంబోడియా మధ్య ఉద్రిక్తతలు

సాక్షి డిజిటల్ న్యూస్ : కంబోడియాలో హిందూ విశ్వాసంపై పెద్ద దాడి జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా హిందువుల ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. థాయిలాండ్-కంబోడియా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంతో ప్రభావితమైన ప్రాంతంలో విష్ణువు విగ్రహాన్ని (Cambodia Vishnu statue)కూల్చివేసింది థాయ్‌ సైన్యం. ఈ దాడిపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటువంటి అగౌరవ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఇలాంటి దాడులు మతపరమైన, సాంస్కృతిక వారసత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు. రెండు దేశాలు చర్చల ద్వారా శాంతి స్థాపన దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం, వారసత్వ నష్టం జరగకుండా చూడాలని పిలుపునిచ్చారు. థాయిలాండ్-కంబోడియా సరిహద్దు వివాదం డిసెంబర్ 7న తిరిగి ప్రారంభమైంది.థాయిలాండ్-కంబోడియా సరిహద్దులో సైనిక ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో 9 మీటర్ల ఎత్తైన విష్ణు విగ్రహాన్ని కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. థాయిలాండ్ సైన్యం బుల్డోజర్‌తో విష్ణువు విగ్రహాన్ని కూల్చివేసినట్లు స్పష్టంగా ఈ వీడియోలో కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోనూ థాయిలాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా, ఈ చర్య మతపరమైన మనోభావాలను దెబ్బతీయడానికి కాదని, భద్రతా కారణాలతో కూడుకున్నదని, మతపరమైన ఉద్దేశాలు ఏవీ లేవని అధికారులు తెలిపారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.నిజానికి, థాయిలాండ్ కంబోడియాలో విష్ణువు విగ్రహం నిర్మించిన ప్రాంతాన్ని తన సొంత భూమిగా భావిస్తుంది. ఈ కారణంగా, థాయిలాండ్ ఈ చర్యను చేపట్టడం ద్వారా భారతదేశ మనోభావాలను దెబ్బతీసింది. థాయిలాండ్-కంబోడియా సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణల్లో ఇప్పటివరకు రెండు దేశాలకు చెందిన 80 మంది సైనికులు, పౌరులు మరణించారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *