సాక్షి డిజిటల్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల సంఖ్య 28కి చేరనుంది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, గతంలో అన్నమయ్య జిల్లాలో భాగంగా ఉన్న రాజంపేటని తిరిగి కడప జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా పరిధిలోని రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.