సాక్షి డిజిటల్ న్యూస్ :ముంబైలోని భండూప్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ముంబై నగర రవాణా సంస్థ (బెస్ట్)కు చెందిన ఓ ఎలక్ట్రికల్ బస్సు అదుపు తప్పి, పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు పాదచారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాత్రి 10 గంటలకు ప్రమాదం.. నిత్యం రద్దీగా ఉండే భండూప్ స్టేషన్ రోడ్డు సమీపంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విఖ్రోలి డిపోకు చెందిన బస్సు రూట్ నంబర్ ఏ-606 ప్రయాణాన్ని ముగించుకుని స్టేషన్ సమీపంలో రివర్స్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ అజాగ్రత్త, సాంకేతిక లోపం కారణంగా బస్సు ఒక్కసారిగా వెనుక ఉన్న పాదచారులను ఢీకొట్టింది. అదే సమయంలో రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్న ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తం అయ్యేలోపే బస్సు వారిపైకి దూసుకు వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా కలకలంరేపింది.
పోలీసుల అదుపులో డ్రైవర్.. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.