సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
గ్రామీణ ఐక్యతకు మరో ఉదాహరణగా మాడుగులపల్లి మండలం గండ్రవాణిగూడెం గ్రామం నిలిచింది. అదే గ్రామానికి చెందిన కంచర్ల సూర్యనారాయణ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, గ్రామ నాయకులు, పెద్దలు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆయనకు అండగా నిలిచారు.
గత కొద్ది రోజులుగా కంచర్ల సూర్యనారాయణ రెడ్డి లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. లివర్‌కు ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం లివర్‌కు సంబంధించిన శస్త్రచికిత్స తప్పనిసరి అని సూచించారు. ఈ ఆపరేషన్‌కు దాదాపు పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు.ఈ విషయం తెలుసుకున్న గండ్రవాణిగూడెం గ్రామ నాయకులు, పెద్దలు స్పందించి, “మన గ్రామస్తుడికి మనమే అండగా నిలవాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు. ఎవరికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందిస్తూ, సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పి, మానసికంగా కూడా బలాన్నిచ్చారు. గ్రామంలో ఐక్యత, పరస్పర సహకారం ఇంకా బలంగా ఉందని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. కష్టకాలంలో ఒకరి కోసం అందరూ కలసి నిలబడటమే నిజమైన గ్రామీణ సంస్కృతి అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. సూర్యనారాయణ రెడ్డి త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
