Header Banner

రాణి కుముదిని దేవి జయంతి సందర్భంగా విస్తృత సేవా కార్యక్రమాలు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు 1960 దశకంలో తొలి మహిళ మేయర్‌గా సేవలందించిన ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త, నిస్వార్థ రాజకీయవేత్త రాణి కుముదిని దేవి జయంతిని పురస్కరించుకొని శివనంద రిహబిలిటేషన్ హోమ్, రాందేవ్ రావు హాస్పిటల్ కుముదిని దేవి స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.వడ్డేపల్లి సంస్థానానికి చెందిన ఆడపడుచుగా, వనపర్తి సంస్థానానికి కోడలుగా గుర్తింపు పొందిన రాణి కుముదిని దేవి అట్టడుగు వర్గాల అభ్యున్నతికై అంకితభావంతో పనిచేశారని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజం వెలివేసిన కుష్టు వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకొని ఆశ్రయం, వైద్యం అందించిన అపూర్వ మానవతావాదిగా ఆమె సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పునరావాసం కోసం శివనంద రిహబిలిటేషన్ హోమ్‌ను స్థాపించడంతో పాటు, అన్ని వర్గాలకు అతి తక్కువ ధరలలో వైద్యం అందించాలనే సంకల్పంతో రాందేవ్ రావు హాస్పిటల్‌ను ఏర్పాటు చేసిన దాతృత్వం విశేషమని అన్నారు. జయంతి కార్యక్రమాల్లో భాగంగా రాందేవ్ రావు హాస్పిటల్‌లో రాణి కుముదిని దేవి చిత్రపటానికి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పరిపాలనా సిబ్బంది పాల్గొని మేడం చేసిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం శివనంద రిహబిలిటేషన్ హోమ్‌లో ఏర్పాటు చేసిన రాణి కుముదిని దేవి విగ్రహానికి రంతిదేవ్ రావు, మీరా రావు, విక్రందేవ్ రావు, జ్యోతి రావు, విజయలక్ష్మి, పృథ్వీరెడ్డి, భారతి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అపర్ణ రావు, ప్రశాంత్ రెడ్డి, శివనంద రిహబిలిటేషన్ హోమ్ సీఏఓ డాక్టర్ అనంత్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ జగన్నాధ రెడ్డి సతీమణి పరిమళ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత శివనంద ఫిజియో రిహాబిలిటేషన్ సెంటర్‌ను ప్రదీప్ చౌదరి ప్రారంభించారు. పరిమళ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని జయరాం పింగళి, ఊర్మిళ పింగళి, గౌతమ్ పింగళి, సురేఖ పింగళి, విద్యాసాగర్ రావు, దీపిక ఆవిష్కరించారు.
తదుపరి కుముదిని దేవి స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో కొత్తగా చేరిన బీఎస్సీ, జీఎన్ఎం విద్యార్థులకు ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రతిజ్ఞను మేరీ డేవిడ్ , కాలేజ్ ప్రిన్సిపాల్ అర్చన విద్యార్థులతో చేయించారు. ఈ కార్యక్రమాల్లో రాందేవ్ రావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కమలాకర్, సీఈఓ డాక్టర్ యోబు, ఆసుపత్రి నర్సింగ్ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.