Header Banner

బుగ్గారం ను అసెంబ్లీ నియోజక వర్గంగా మార్చండి

జిల్లా కలెక్టర్ కు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి

సాక్షి డిజిటల్ మార్చ్ 30 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

పాత నియోజక వర్గ కేంద్రమైన బుగ్గారం ను తిరిగి మళ్లీ అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంగా మార్చాలని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు.గత నియోజక వర్గాల పునర్విభజనలో బుగ్గారం ను ధర్మపురి నియోజక వర్గంగా మార్పు చేసి మాకు, మా గ్రామానికి తీరని అన్యాయం చేశారని ఆ వినతి పత్రంలో చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత నియోజక వర్గాల పెంపు ( డీ లిమిటేషన్ ) లో భాగంగా మా బుగ్గారం ను తిరిగి “ అసెంబ్లీ నియోజక వర్గం” గా మార్చాలని ఆయన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ను కోరారు.ఇందుకు గాను తగు సర్వే నిర్వహించి “బుగ్గారం అసెంబ్లీ నియోజక వర్గం” అగుటకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు ప్రతిపాదనలు పంపవలసిందిగా చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి విలేఖరులతో మాట్లాడారు. బుగ్గారం నియోజక వర్గ సాధన కోసం త్వరలోనే అన్ని వర్గాల ప్రజలతో సాధన కమిటి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.బుగ్గారం నియోజక వర్గ సాధన కమిటి ఆధ్వర్యంలో స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ఉద్యమాల రథ సారధి, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ యం.కోదండరాం ల సహకారంతో "బుగ్గారం నియోజక వర్గ సాధన" కోసం ప్రణాళిక సిద్ధం చేసుకొని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.నియోజక వర్గాల పెంపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏర్పాటు చేసే డీ లిమిటేషన్ కమిటికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర మంత్రులకు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, తదితరులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తగు విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతోందని అన్నారు. బుగ్గారం నియోజక వర్గం పరిధిలోకి వచ్చే పలు మండలాలకు చెందిన ప్రముఖులను, వివిధ రాజకీయ పార్టీల నేతలను, సకల జనులను కలుపుకొని ఉద్యమాలు చేసి అయినా "బుగ్గారం నియోజక వర్గం" సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇందుకు గాను అన్ని పార్టీల నేతలు, సకల జనులు సహకరించాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో చుక్క గంగారెడ్డి వెంట శ్రీపేరంబూదూరి సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.