సాక్షి డిజిటల్ న్యూస్ -,ఏప్రిల్ 19z హైదరాబాద్ -
హైదరాబాద్ నగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు.సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లతో నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని, వ్యసనం నుండి బయటపడటానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, బాధితులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. అనంతరం వైద్యులతో సమావేశమై, కౌన్సెలింగ్ ప్రక్రియ, చికిత్స అందిస్తున్న తీరును ఆడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచామని, ఇందులో భాగంగా 239 మంది రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా, 188 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.ప్రస్తుతం 35 మంది గాంధీ డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతుండగా, మిగతా వారికి ఇతర కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని అన్నారు. వారం క్రితం ప్రారంభమైన ఈ 15 రోజుల ప్రత్యేక కౌన్సెలింగ్, చికిత్స ద్వారా వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అత్యాధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందుబాటులో ఉంచామని వివరించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు, ముఖ్యంగా యువతకు కచ్చితంగా డ్రగ్ టెస్టులు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించామని వెల్లడించారు.ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ప్రతిపాదనలతో రాష్ట్రవ్యాప్తంగా 35 డీ-అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు కావడం దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు.ఇది తెలంగాణ ప్రభుత్వ చారిత్రక నిర్ణయమని, దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున 35 చోట్ల డీ ఆడిక్షన్ కేంద్రాల్లేవని అన్నారు. ఈ కేంద్రాల వల్ల ఎంతో మంది డ్రగ్స్ వ్యసనపరులకు విముక్తి కలుగుతుందని చెప్పారు. ఒకవైపు బాధితులను వ్యసనం నుండి విముక్తులను చేస్తూనే, మరోవైపు డ్రగ్స్ విక్రేతలపై ఉక్కుపాదం మోపుతామని, నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మళ్లీ ఇదే కేసుల్లో దొరికితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. నగరంలో డ్రగ్స్ నియంత్రణకు హెచ్-న్యూ విభాగం అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులతో సహకరించాలని పిలుపునిచ్చారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి నేతృత్వంలోని వైద్య బృందం, పోలీస్ విభాగం సమన్వయంతో పనిచేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి , సైకియాట్రీ హెచ్ఓడీ డాక్టర్ సురేష్, ఆర్ఎంవోలు డాక్టర్ శేషాద్రి, డాక్టర్ యుగేందర్, డాక్టర్ సరిత, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ రజిని పాల్గొన్నారు. పోలీస్ విభాగం నుండి సికింద్రాబాద్ డీసీపీ శ్రీమతి రక్షితా కృష్ణామూర్తి, ఐపీఎస్, టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఐపీఎస్, అదనపు డీసీపీ శ్రీ అందే శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
