కశ్మీర్ ఉగ్రవాద నెట్‌వర్క్‌పై ఆపరేషన్‌లో తెలుగు అధికారి కీలక పాత్ర

సాక్షి డిజిటల్ న్యూస్ :జమ్మూ కశ్మీర్ పోలీసులు భారీ ఉగ్రనెట్‌వర్క్‌ను చేధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు… వివిధ ప్రాంతాల నుంచి 2,900 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, బాంబు తయరీ సామాగ్రీ, రెండు ఏకే- సిరీస్ ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఇప్పటివరకు సేకరించి ఆధారాలతో అనేక రాష్ట్రాలలో విస్తరించి ఉన్న జైష్-ఏ-ముహమ్మద్ (జేఎం) ఉగ్రవాద నెట్‌వర్క్‌ మూలాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉగ్రనెట్‌వర్క్ చేధింపులో తెలుగు పోలీసు అధికారి, ఐపీఎస్ సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. అయితే ఉగ్రనెట్‌వర్క్‌ను చేధించడంలో సందీప్ చక్రవర్తి ఎలాంటి పాత్ర పోషించారు?, ఆయన కేరీర్ ఎలా సాగుతుంది?… వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో జన్మించారు. సందీప్ చక్రవర్తి తండ్రి జీవీ రామ్‌గోపాల్ రావు కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఆర్ఎంవోగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన తల్లి పీసీ గంగమ్మ ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సందీప్… కర్నూలులోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తొలుత ఆయన మెడిసిన్ పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత సివిల్స్‌‌లో ర్యాంకు సాధించి… ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)గా పనిచేస్తున్నారు. సందీప్ చక్రవర్తి… తన సర్వీసులో పూంచ్ ఏఎస్‌పీగా పనిచేశారు. హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లాలో కీలక పోస్టింగ్‌లలో పనిచేశశారు. ఆయన ఇప్పటివరకు ఆరు సార్లు రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం అందుకున్నారు. అలాగే నాలుగుసార్లు జమ్మూ అండ్ కశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్, ఇతర పతకాలను అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *