రాష్ట్ర పాలనలో కీలక దశ: కేబినెట్‌ భేటీలో ప్రధాన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ :హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం జరగనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులు, వాటితో ముడిపడి ఉన్న స్థానిక ఎన్నికలపై కేబినేట్ చర్చించనుంది. పత్తి రైతులను ఇబ్బంది పెట్టే విధంగా  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై మంత్రివర్గం చర్చించనుంది. దీంతో పాటు ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తినే కొంటామని, జిన్నింగ్ మిల్లులను ఎల్ 1, ఎల్ 2 కేటగిరీలో అలాట్ చేసేలా సీసీఐ అనుచితమైన నిబంధనలు విదించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తప్పుబట్టింది. ఇప్పటికే సీసీఐ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో విఫలమైంది. అందుబాటులో ఉన్న  25 లక్షల టన్నుల పత్తి నిల్వల్లో కేవలం 1.20 లక్ష టన్నులే కొనుగోలు చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. గిగ్ వర్కర్స్ సంక్షేమ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైతు భరోసా పథకం కింద రైతులకు ఆర్థిక సాయం పంపిణీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మరోవైపు కేంద్రం అనుసరించిన విధానాలతో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని మిల్లర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న అంశాలను పరిశీలిస్తే.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులగణన విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ. 6,000 ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. అమిటీ, సెంటినరీ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్‌లను విశ్వవిద్యాలయాలుగా మార్చే బిల్లుకు ఆమోదం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *