జగన్ ప్రభుత్వ కాలంలోని కేసుపై ఏసీబీ కోర్టు నిర్ణయం: చంద్రబాబుకు ఊరట

సాక్షి డిజిటల్ న్యూస్ :అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్ కె బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఫిర్యాదుదారుడు, బాధితుడు కాదని కోర్టు స్పష్టం చేసింది. సీఐడీ నమోదు చేసిన రెండు కేసులను మూసివేయడానికి అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుందని చెబుతున్నారు. ఇది చంద్రబాబుకు ఉపశమనం కలిగించే అంశం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.గత వైఎస్సార్‌సీపీ హయాంలో నమోదైన కేసులో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో జర్నలిస్ట్ కె బాలగంగాధర్‌ తిలక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలులో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో తిలక్ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడూ కాదని కోర్టు స్పష్టం చేసింది. గత ప్రభుత్వం 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ భూముల కొనుగోళ్లపై సీఐడీలో రెండు కేసులు నమోదు చేసింది. యల్లమాటి ప్రసాద్‌కుమార్, నల్లూరు రవికిరణ్‌ అనే వ్యక్తుల ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో చంద్రబాబుతో సహా మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపైనే సీఐడీ కేసులు నమోదు చేసింది.తాజాగా చంద్రబాబుపై సీఐడీ అమరావతి అసైన్డ్ భూముల విషయంలో నమోదు చేసిన రెండు కేసులను మూసివేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలిసిందంటూ.. జర్నలిస్ట్ తిలక్ మరోసారి విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి నమోదు చేసిన కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని తాను హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ పెండింగ్‌లో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఐడీ అధికారులు ఆ కేసులను మూసివేయడానికి పిటిషన్లు దాఖలు చేస్తే, వాటిపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని తిలక్ తన పిటిషన్‌లో కోరారు. అయితే, ఏసీబీ కోర్టు ఆయన పిటిషన్‌ను పరిశీలించి, దానిని వెనక్కి పంపింది. ఒకవేళ సీఐడీ ఏసీబీ కోర్టులో ఈ కేసుల్ని మూసివేయడానికి సీఐడీ క్లోజర్‌ పిటిషన్‌లు దాఖలు చేస్తే చంద్రబాబుకు ఊరట దక్కే అవకాశం ఉందంటున్నారు. అలాగే తిలక్ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరిగి ఇచ్చేయడంతో రిలీఫ్ దక్కింది.. లేకపోతే మళ్లీ ఈ వ్యవహారం మొదటికి వచ్చేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *