హాస్టల్‌లో కలకలం: విద్యార్థినిపై వార్డెన్‌ హింస

సాక్షి డిజిటల్ న్యూస్ :ఓ హాస్టల్‌ వార్డెన్‌ డిగ్రీ విద్యార్థినిపై దారుణంగా దాడి చేసింది. పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదని బూతులతో రెచ్చిపోతూ.. విచక్షణా రహితంగా చితకబాదింది. కొట్టొద్దని విద్యార్ధిని ఎంతగా వేడుకున్నా వార్డెన్‌ మాత్రం దారుణంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను తోటి విద్యార్ధులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం కాస్తా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిని వార్డెన్ చితకబాదిన ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో డిగ్రీ థర్డ్‌ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవాని కర్రతో, చేతులతో విచక్షణారహితంగా కొడుతూ, బూతులు తిట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడే ఉన్న అదే హాస్టల్‌లోని తోటి విద్యార్ధులు ఈ ఘటనను వీడియోలో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత నెల నవంబర్‌ 24న ఈ ఘటన జరిగింది. అయితే వీడియో వైరల్‌ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో ఎగ్జిట్‌ అని చెప్పి పోయినవ్‌ కదా.. ఎగ్జిట్‌ పన్నెండింటికి అయిపోతది. మళ్లీ ఎగ్జిట్‌ అయిపోయే టైంకి హాస్టల్‌ ఉండాలన్న సోయి లేదా నీకు? నువ్వు హాస్టల్‌కి రాకపోతే నా ఉద్యోగం ఉంటదా? అంటూ వార్డెన్‌ భవాని చేతిలో కర్ర తీసుకుని విద్యార్ధిని గొడ్డును బాదినట్లు కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఈ లోపు ఫోన్‌ రావడంతో ఫోన్‌ మాట్లాడి ఆ తర్వాత రెండు చేతులతో విద్యార్థినిని చితకబాదింది. విద్యార్ధినిపై వార్డెన్‌ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా రెండు నెలల క్రితం ఇదే ఎస్సీ హాస్టల్ వార్డెన్‌ విద్యార్థినులకు మత బోధనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు హాస్టల్ వార్డెన్‌ విద్యార్ధినిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో మరోమారు ఈ హాస్టల్ పేరు మారుమోగిపోయింది. దీంతో విద్యార్థి సంఘాలు సదరు వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపట్టారు. విద్యార్థిని పట్ల దారుణంగా వ్యవహరించిన వార్డెన్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *