వార్త నచ్చలేదని దాడులా? ఇది వ్యక్తిపై కాదు, ప్రజాస్వామ్యంపై దాడి

.జర్నలిస్టుల భద్రతను తేలికగా తీసుకుంటే మూగబోయేది ప్రజల గొంతే

మీడియా స్వేచ్ఛకు ఎదురైన సవాలు.

సాక్షి డిజిటల్ న్యూస్ డెస్క్ : జనవరి 19

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టు పని నిజాలను ప్రశ్నించడం, ప్రజల తరఫున అధికారాన్ని నిలదీయడం. అయితే నచ్చని వార్త రాసినందుకే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయంటే, అది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన హింస కాదు, ప్రజాస్వామ్య మూల స్తంభాన్ని కూల్చే ప్రయత్నం. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఈ ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనం.ఈ నెల 15 వ తేదీన సాక్షి డిజిటల్ న్యూస్ ప్రకాశం & మార్కాపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ జర్నలిస్టు “షేక్ మక్బూల్ బాష” తన వృత్తి విధులలో భాగంగా రాసిన వార్తను జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన మీడియా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. బాధిత జర్నలిస్టు ఫిర్యాదు ప్రకారం, వార్త ప్రచురణే కారణంగా దుర్భాషలు, బెదిరింపులు చోటు చేసుకుని, చివరకు శారీరక దాడికి దారితీశాయి. ఈ సంఘటన సాధారణ గొడవగా కాకుండా భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.న్యాయ వర్గాల ప్రకారం, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ఉద్దేశంతో దాడి చేస్తే, అది మూకుమ్మడి నేరంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా తల, ముఖం, చెవి వంటి సున్నితమైన శరీర భాగాలపై దాడి జరిగితే, ప్రాణాలు తీసే ఉద్దేశం ఉందా అనే అంశాన్ని కోర్టులు తీవ్రంగా పరిశీలిస్తాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి కేసుల్లో Attempt to Murder (IPC 307) సహా పలు కఠిన సెక్షన్లు వర్తించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.జర్నలిస్టులు ప్రజలకు సమాచారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తారు. వార్త నచ్చకపోతే చట్టబద్ధమైన మార్గాలు ఉన్నప్పటికీ, హింసకు పాల్పడడం చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(A) ద్వారా రక్షితమైన మీడియా స్వేచ్ఛను అణిచివేయడానికి చేసే ప్రయత్నాలను కోర్టులు సహించవని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.ఈ ఘటన జర్నలిస్టుల భద్రత అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. పోలీస్ చర్యలు ఆలస్యం అయితే లేదా తేలికపాటి సెక్షన్లతో కేసును నమోదు చేస్తే, బాధితుడు CrPC 156(3) లేదా CrPC 200 ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పూర్తి హక్కు ఉందని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టకపోతే, అది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.జర్నలిస్టులపై దాడులు పెరిగితే, రేపు ప్రశ్నించే గొంతులు తగ్గిపోతాయి. నిజం రాయాలంటే భయం, వాస్తవాలను వెలుగులోకి తేవాలంటే బెదిరింపులే ఎదురవుతాయనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నష్టపోయేది ఒక్క జర్నలిస్టు కాదు , సమాజం మొత్తం నష్టపోతుంది.కాబట్టి జర్నలిస్టుల భద్రతను వ్యక్తిగత సమస్యగా కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంగా అటు ప్రభుత్వం, ఇటు పోలీస్ వ్యవస్థ చూడాలి. నచ్చని వార్తలకు హింసతో సమాధానం చెప్పే సంస్కృతి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే, అది రేపు ఇంకా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయడం ఖాయం అని, జర్నలిస్టు భద్రత అంటే ప్రజల హక్కుల భద్రతే అని, ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేయలేం అని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *