మేడారం జాతరలో లేడీ ఐపిఎస్ అట్రాక్షన్.. నెట్టింట హాట్‌ టాపిక్‌గా వసుంధర యాదవ్‌

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. జనవరి 28న ప్రారంభమైన ఈ జాతర జనవరి 31 వరకు జరిగింది, కీలక ఘట్టాలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. గిరిజన పూజారులు సమ్మక్క, సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర పరాకాష్టకు చేరింది. అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం బాట పట్టారు.ఇదిలా ఉండగా, ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్‌ అధికారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతర విధుల్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి నెట్టింట సెన్సేషన్‌గా నిలుస్తున్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న వసుంధర యాదవ్‌ ఈ జాతర భద్రతా ఏర్పాట్లకు నాయకత్వం వహిస్తున్నారు. యూపీ నేపథ్యంతో తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణిగా ఆమె చురుకుదనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించిన వసుంధర యాదవ్‌, ఉత్సవ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కనిపించారు. తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన సమయంలో ఆమె చూపిన ఉత్సాహం, కేరింతలు, సారలమ్మ గద్దెల వద్ద మంత్రి సీతక్కతో కలిసి వేసిన స్టెప్పులు వీడియోలుగా మారి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ దృశ్యాలు లక్షలాది వ్యూస్‌ సాధిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
విధినిర్వహణలో నిష్ట, క్రమశిక్షణతో పాటు జాతర వాతావరణంలో భాగమై కనిపించిన వసుంధర యాదవ్‌ తీరును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాధారణ పోలీస్‌ విధులకు అతీతంగా ప్రజలతో కలిసిపోయేలా వ్యవహరించడం అరుదని, ఇది భద్రతా బలగాలపై సానుకూల ఇమేజ్‌ను పెంచుతోందని అభిప్రాయపడుతున్నారు. మహిళా అధికారులకు ఆదర్శంగా నిలుస్తూ, మేడారం జాతరలో ‘స్పెషల్‌ అట్రాక్షన్‌’గా వసుంధర యాదవ్‌ నిలిచారనే మాటలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *