బీహార్ ఎన్నికలు 2025: కోటి ఉద్యోగాలు, లఖ్‌పతి దీదీల హామీతో ఎన్డీయే మేనిఫెస్టో విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ :బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) తమ ఉమ్మడి మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ‘‘సంకల్ప్ పాత్ర’’ పేరుతో ఎన్డీయే కూటమి ఈ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచింది. ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీహార్ సీఎం నితీష్ కుమార్, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా తదితరులు పాల్గొన్నారు. బీహార్ ప్రజలపై ఎన్డీయే మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించింది. ఒక కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలాగే మహిళా సాధికారతపై తాము దృష్టి సంకేతాన్ని పంపే ప్రయత్నం చేసింది. కనీసం 1 కోటి మంది ‘‘లఖ్‌పతి దీదీలను’’ తయారు చేస్తామని… ఇందుకోసం మహిళలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టుగా కూడా పేర్కొంది. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే ఆ వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. అలాగే ప్రతి జిల్లాలోని మెగా స్కిల్ సెంటర్‌లను ‘‘గ్లోబల్ స్కిల్లింగ్ సెంటర్‌లు’’ మారుస్తామని కూడా కూడా తెలిపింది. అలాగే రైతులపైన కూడా హామీల వర్షం కురిపించింది. కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో… రైతులకు పంట సీజన్‌కు రూ. 3 వేల చొప్పున, ఏడాదికి మొత్తంగా రూ. 9,000 అంజేయనున్నట్టుగా తెలిపపింది. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారేలా చర్యలు చేపడతామని… నీటిపారుదల, గిడ్డంగులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు సహా వ్యవసాయ మౌలిక సదుపాయాలలో రూ. లక్ష కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చింది.బీహార్ గతి శక్తి మాస్టర్ ప్లాన్ కింద ఏడు కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్నట్టుగా, 3,600 కి.మీ రైల్వే ట్రాక్‌లను ఆధునీకరించనున్నట్టుగా హామీ ఇచ్చింది. నాలుగు నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో రాపిడ్ రైల్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబడతాయని పేర్కొంది. పేద కుటుంబాల విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్యను ఎన్డీయే కూటమి ప్రతిజ్ఞ చేసింది. పాఠశాలల్లో ఆధునిక నైపుణ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నట్టుగా హామీ ఇచ్చింది. ఇక, బీహార్‌లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ ఇప్పటికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మహాఘట్‌బంధన్‌ కూటమి… తమ సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ప్రకటించడమే కాకుండా… తేజస్వీ ప్రతిజ్ఞ పేరుతో మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. ఎన్డీయేలో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలో ఉన్నాయి. మరోవైపు మహాఘట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, దీపాంకర్ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (సీపీఐ-ఎంఎల్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం), ముఖేష్ సహానీ వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లు ఉన్నాయి. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనుండగా… తొలి దశ పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *