ముందస్తు చర్యలతో ఎల్-నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం

July 21, 2026 | తెలంగాణ

*ఎల్-నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి **

*రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి** మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్ష

సాక్షి డిజిటల్ న్యూస్ జూలై 20 అందోల్ (ప్రతినిధి జెల్ల భాగయ్య)ఎల్-నినో ప్రభావం కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి,మెదక్ జిల్లాలలో ఎల్-నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు, జిల్లాల వారీ అమలు తీరుపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్-నినో ఒక సహజ ప్రకృతి విపత్తు అని, దీని ప్రభావాన్ని అర్థం చేసుకొని నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. లోటు వర్షపాతం, నీటి కొరత, పంటలపై ప్రతికూల ప్రభావం వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు.వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, విద్యుత్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ లేదా ఎనిమిది ఎకరాల కంది పంట సాగు చేయవచ్చని పేర్కొన్నారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.రైతులకు అవగాహన కల్పించేందుకు వీడియో రీల్స్, నాటక ప్రదర్శనలు, కళాజాతాలు, అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించాలని సూచించారు. జిల్లాలలో పలుచోట్ల కోతుల బెడద ఉన్నందున దానిని నివారించే చర్యలు చేపడితే రైతులు పంటల మార్పిడి వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అన్నారు.ఎల్-నినో ప్రభావం తీవ్రత పెరిగితే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున నీటి వృథాను అరికట్టడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. బోర్‌వెల్‌ల రీచార్జ్‌, వర్షపు నీటి సంరక్షణ, నీటి వినియోగంలో పొదుపు వంటి చర్యలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు.ప్రజలకు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పశువులకు మేత కొరత ఏర్పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అలాగే ఆరోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నివారణతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి, ఎ. వాణి ప్రసాద్ మాట్లాడుతూ, ఎల్-నినోను ముందస్తుగా అంచనా వేసి ప్రభుత్వం ప్రతి శాఖను సమాయత్తం చేస్తోందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ఈ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.అనంతరం మంత్రి “జలసిరి” ప్రచార పోస్టర్లను, జిల్లా కంటింజెన్సీ ప్లాన్‌ ను ఆవిష్కరించారు.అంతకుముందు వివిధ శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వర్షపాత పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల స్థితి, జలవనరులలో నీటి లభ్యత, విద్యుత్, తాగు నీటి సరఫరా, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలను వివరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి ఎ. వాణి ప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి,వివిధ మున్సిపాలిటీల ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మెదక్, సంగారెడ్డి జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఆత్మ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper