రేవంత్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శలు-“ప్రజలను మోసం చేసే రాజకీయాలు”

సాక్షి డిజిటల్ న్యూస్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తుపాకీ వెంకట్రావులా మభ్యపెడతారు అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అసలేమాటకారి అని అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.పక్కా మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలు మానుకోవాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.

బీజేపీతో సీఎం రేవంత్ కుమ్మక్కు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.బీజేపీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైంది కాబట్టే మంత్రులు భారీ ఎత్తున అవినీతి పాల్పడుతున్నా కమలనాధులు అసలు నోరెత్తడం లేదని విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిందని, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు నిండా మునిగారు అని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలి ఆర్థికంగా అంతా కుదేలయ్యారని మండిపడ్డారు. చివరకు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేడని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైందని ఆరోపించారు. రైతుల వడ్లకు కాంటాలు, బస్తాలు ఇవ్వడం లేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *