పక్కన ఉండి చేసే కుట్ర: అసలు విషయం వెలికితీయబడింది

సాక్షి డిజిటల్ న్యూస్ :వాళ్లిద్దరికి ముందు నుంచే పరిచయం ఉంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు.. అయినా అందులో ఒక వ్యక్తి పక్కా ప్లాన్‌తో మరో వ్యక్తికి రూ.25లక్షల కుచ్చుటోపి పెట్టాడు. తన పక్కనున్న వ్యక్తే తన డబ్బులు కాజేశాడని తెలియని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తీరా అసలు విషయం తెలసుకొని కంగుతున్నాడు. ఇంతకు ఏం జరిగింది.. నిందితుడు.. బాధితుడి నుంచి డబ్బులు ఎలా కాజేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే, హైదరాబాద్ కు చెందిన శ్రీ గణేష్, నరేష్ ఇద్దరూ కొద్దీ కాలం క్రితం గోవాలో వ్యాపారం చేశారు. ఇద్దరూ హైదరాబాద్ కే చెందిన వాళ్లే అయిన వీరిద్దరికి పరిచయం గోవాలోనే అయింది. అక్కడే కలిసి బిజినెస్ చేశారు. అయితే బిజినెస్ లో నష్టాలు రావడంతో నరేష్ హైదరాబాద్ వచ్చేశాడు. కొద్దీ రోజుల క్రితం నరేష్.. శ్రీ గణేష్‌కు ఫోన్ చేసి తక్కువ ధరకే బంగారం వస్తుందని చెప్పాడు. నిజమైన బంగారం అని గ్యారంటీ ఏంటో చెప్పాలని శ్రీగణష్ అడిగాడు. ముందుగా వెళ్లి చెక్ చేసుకున్న తర్వాతే బంగారం కొనుగోలు చేయవచ్చని నరేష్ చెప్పాడు. దీంతో గోవా నుండి గుంటూరు వచ్చిన శ్రీగణేష్ బంగారాన్ని చెక్ చేసుకున్నాడు. అంతా ఒకే అనుకున్న తర్వాత శుక్రవారం గోవా నుండి 25 లక్షల రూపాయలు తీసుకొని బయలు దేరాడు. అయితే శ్రీగణేష్ ను కోటప్పకొండ సమీపంలోని యూటీ వద్దకు రావాలని నరేష్ చెప్పాడు. శ్రీగణేష్ అక్కడకు వచ్చిన తర్వాత ముందుగా కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని చెప్పిన నరేష్.. అతన్ని తీసుకొని కొండకు వెళ్లాడు. అక్కడ దర్శనం అయిన తర్వాత ఇద్దరూ కలిసి తిరిగి యూటీ వద్దకు వచ్చారు. అయితే అప్పటికే అక్కడ పోలీస్ దుస్తుల్లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిద్దరిని పట్టుకొని బ్యాగ్ లో ఏముందని ప్రశ్నించారు. అందులో క్యాష్ ఉండటాన్ని గమనించి వెంటనే బ్యాగ్ తీసుకొని పోలీస్ దుస్తుల్లో ఉన్న వాళ్లంతా పారిపోయారు. ఖంగుతిన్న శ్రీగణేష్ కు ఏం జరిగిందో అర్ధం కాలేదు. పోలీస్ దుస్తుల్లో ఉన్న వాళ్లే కంగారు పడి అక్కడ నుండి పారిపోవడంతో అనుమానం వచ్చిన శ్రీగణేష్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే నరేష్ మాత్రం తనకి వాళ్లేవరో తెలియదని చెప్పాడు. పోలీసులు మాత్రం నరేష్ పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా మోసాలు చేయడం బాపట్ల జిల్లాలోని ర్యాప్ గ్యాంగ్స్ పెట్టింది పేరు. గతంలో బాపట్ల మండలంలోని వెదుళ్లపళ్లి, బాపట్లు, సువర్ట్ పురం పరిసర ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు ఎక్కువుగా జరిగేవి. అయితే పోలీసులు నిఘా పెంచడంతో ఈ ముఠాలోని సభ్యులు చెల్లా చెదురై పోయారు. మోసాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే ర్యాప్ గ్యాంగ్ నర్సరావుపేట వరకూ రావడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. వెదుళ్లపల్లికి చెందిన ముఠానే మోసం చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ర్యాప్ గ్యాంగ్ కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *