రేవంత్ సర్కార్ సంతోషకర నిర్ణయం — చిన్నారుల అభివృద్ధికి రేపటి నుండి అమలు

సాక్షి డిజిటల్ న్యూస్ :తెలంగాణ ప్రభుత్వం చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వినూత్న కార్యాచరణ చేపట్టింది. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు రోజూ సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రాల్లో గోరువెచ్చని పాలు అందించనున్నారు. ఈ పథకం ద్వారా 7,918 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది.చిన్నారులలో పోషకాహార లోపాన్ని సమర్థవంతంగా అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన, ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలందరికీ రోజూ సాయంత్రం వేళ గోరు వెచ్చని పాలు అందించాలని నిర్ణయించారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని తొలి దశలో ములుగు జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడాదికి 200 పని దినాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న మొత్తం 7,918 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది.గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు ఉదయాన్నే పనులకు వెళ్లడం వల్ల తమ చిన్నారులకు సరైన సమయంలో సమతుల్యమైన పోషణ అందించే అవకాశం ఉండడం లేదు. దీని ఫలితంగా చాలామంది పిల్లలు పోషకాహారం అందక ఎత్తుకు తగ్గ బరువు లేకుండా, వయసుకు తగిన ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడం, పిల్లలలో పోషకాహార లోపాలను సవరించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రణాళిక ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రాలలో రోజూ సాయంత్రం వేళ చిన్నారులకు ఇచ్చే సాధారణ స్నాక్స్‌తో పాటు, అదనంగా 100 మిల్లీ లీటర్ల గోరు వెచ్చని పాలను అందించనున్నారు. పిల్లలకు అందించే ఈ పాలు విజయ డెయిరీ సంస్థ ద్వారా డబుల్‌ టోన్డ్‌ రకానికి చెందినవిగా ఉండాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమం ములుగు జిల్లాలో రేపట్నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ.. జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసించే చిన్నారులకు పాలు అందించేందుకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిందని, దీనిపై అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గురువారం నుంచి పథకం అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన ధృవీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యకరమైన బాల్యాన్ని పెంపొందించేందుకు ఒక ముందడుగుగా చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *