భారత్ ప్రతిస్పందనతో జకీర్ నాయక్ పర్యటన రద్దు – బంగ్లాదేశ్ నిర్ణయం చర్చనీయాంశం

సాక్షి డిజిటల్ న్యూస్ :వివాదాస్పద ఇస్లాం బోధకుడు, భారత్ నుంచి పారిపోయి మలేషియాలో ఉంటోన్న జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌ వెళ్తారని, ఆయన దాదాపు మూడు వారాలు అక్కడే ఉంటారని ప్రచారం జరిగింది. తాజాగా, జకీర్ తమ దేశంలోకి ప్రవేశంపై తాత్కాలిక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. భారీ జనసందోహం, భద్రతాపరమైన కారణాలతో అతడి పర్యటనకు అనుమతి నిరాకరించింది. గతంలో ఉగ్రవాదులకు ప్రేరణ అందించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయక్‌పై భారత్ మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల కేసుల్లో వాంటెడ్‌గా ప్రకటించింది.వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు, ఇండియా మోస్ట్ వాంటెడ్‌ జకీర్‌ నాయక్‌ తమ దేశంలోకి ప్రవేశంపై బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. జకీర్ నాయక్ బంగ్లాలో పర్యటించనున్నట్టు ఇటీవల అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. కానీ, అతడ్ని తమ దేశంలోకి అనుమతించకూడదని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ జహంగీర్ అలమ్ ఛౌదురి నేతృత్వంలో మంగళవారం జరిగిన శాంతి భద్రతల కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.‘‘జకీర్‌ నాయక్‌ బంగ్లాదేశ్‌కు వస్తే కార్యక్రమాలకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉంది… వారిని అదుపుచేయడానికి పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించాల్సి ఉంటుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో జకీర్ నాయక్ పర్యటనపై దృష్టి సారించి, అంత మంది భద్రతా సిబ్బందిని కేటాయించే అవకాశం లేదు’’ అని అభిప్రాయపడిన అధికారులు అతడి పర్యటనకు అనుమతి నిరాకరించినట్టు స్థానిక పత్రిక నివేదించింది. జకీర్‌ నాయక్ బంగ్లాదేశ్‌‌ సందర్శన గురించి భారత్ చేసిన వ్యాఖ్యలను తాము గమనించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్ఎం మహబూబుల్ ఆలం ఇటీవల తెలిపారు. భారత్‌ సహా ఎవరూ ఒక దేశం నుంచి పరారైన వ్యక్తులకు, నిందితులకు ఆశ్రయం కల్పించకూడదని తాము కోరుకుంటున్నామని అన్నారు. అయితే, జకీర్ నాయక్ పర్యటనపై భారత్ చేసిన హెచ్చరికలతోనే మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.కాగా, 2016 జులైలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ బేకరీపై ఉగ్రదాడి చోటుచేసుకుంది. అనంతరం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరు మాట్లాడుతూ.. తాను యూట్యూబ్ ఛానల్ ద్వారా జకీర్‌ ప్రసంగాలతోనే ప్రేరణ పొందానని వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో అరెస్ట్ భయంతో జకీర్ నాయక్ భారత్‌ నుంచి మలేసియాకు పారిపోయాడు. అతడిపై మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల ఆరోపణల కేసు నమోదుకాగా.. వాంటెడ్‌గా భారత్ ప్రకటించింది. కాగా, అవామీ లీగ్ నేత షేక్ హసీనా పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత పాకిస్థాన్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి.జకీర్‌ నాయక్‌ నవంబర్ 28 నుంచి బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు, అతడికి అధికారిక స్వాగతం పలికేందుకు బంగ్లా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. స్పార్క్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అనే కంపెనీ ఫేస్‌బుక్‌లో జకీర్ నాయక్ నవంబరు చివరిలో బంగ్లాదేశ్‌కు వస్తున్నారని పోస్ట్ చేసింది. ఆయన కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తున్నామని, బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతితోనే ఇది జరుగుతోందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *